కాబోయే అమ్మల కోసం కంఫర్ట్ డ్రస్సులు ఇవిగో!

 

కాబోయే అమ్మల కోసం కంఫర్ట్ డ్రస్సులు ఇవిగో!

మహిళల జీవితంలో గర్భం దాల్చిన కాలం ఎంతో అపురూపమైనది. ఆ సమయంలో ఎంతో జాగ్రత్తగా మరెంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డకు అనుగుణంగా మహిళలు కూడా బరువు పెరగడం సహజం. ముఖ్యంగా పెరుగుతున్న కడుపు పరిమాణం వల్ల అప్పటివరకు తాము ధరించే దుస్తులు పక్కనపెట్టాల్సి వస్తుంది. కొంతమంది ధరించే దుస్తుల విషయంలో ఎంతో అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. మరికొందరు ఇష్టం లేకపోయినా కొన్ని వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఫాషన్ కు ఏంటి తక్కువ?? వెతికితే వెయ్యి రకాలు, కనీసం ఖచ్చితంగా ఎంపిక చేసుకోలేనన్ని, ఇదే నచ్చింది అని ఒక పట్టాన నిర్ణయించుకోలేనన్ని ఫాషన్ దుస్తులు ఉన్నాయి ఇప్పట్లో.

ముఖ్యంగా అన్ని రకాల వారికి సరిపోయేలా దుస్తులను వ్యాపారంలోకి తీసుకొస్తూ వస్త్ర ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు అందంగా ఉంటూ, సౌకర్యాన్ని ఇచ్చే ఎన్నో రకాల ఔట్ ఫిట్స్ ఉన్నాయి కాబోయే అమ్మల కోసం. 

ముఖ్యంగా ఎత్తుమడమ చెప్పులు వేసుకోవడం వదిలెయ్యాలి. వాటి స్థానంలో మెత్తగా ఉన్న చెప్పులు, షూస్ వాడాలి.

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కడుపు భాగం పెరుగుతుంది కాబట్టి సాధారణంగా టాప్స్ మాత్రమే మార్చాల్సిన అవసరం వస్తుంది. అందరూ మొదట సౌకర్యవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప బట్టల ఖరీదు గురించి, అధిక ధర ఉండేవి వాడాలి, ట్రెండింగ్ లో ఉండాలి అని ఆలోచన చేయకూడదు. 

ఇకపోతే చాలా మంది సిటీ లలో ఉండేవారు ధరించేవి టీ షర్ట్ లు. పెరుగుతున్న పొట్ట, వక్షోజాల పరిమాణానికి తగ్గట్టు లూజుగా ఉన్న టీ షర్ట్ లు వేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిలోకి కాంబినేషన్స్ గా లెగిన్స్, ఇతర పాంట్స్ ఎలాగూ మార్కెట్లలో దొరుకుతాయి.

టీ షర్ట్స్ ఏమైనా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి అనే అనుమానం ఉంటే ఎంచక్కా ఆ టీ షర్ట్స్ మీద కోట్స్ వేసుకోవచ్చు. శరీరానికి వెచ్చదనం ఇవ్వడంతో పాటు ఈ కోట్స్ ఫాషన్ గా కూడా ఉంటాయి.

లాంగ్ గౌన్స్ నడుము భాగంలో ఫ్రీగా ఉంటూ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. వీటికి లోపల లెగిన్స్ వేసుకుంటే సరిపోతుంది.

ప్రతిరోజు వ్యాయామం చేయడం గర్భవతులకు ముఖ్యం అలాంటి వారు చిన్న పాటి వ్యాయామాలు చేసేటప్పుడు వెల్వెట్ టైప్ ఫాబ్రిక్ ఉన్న టీ షర్ట్, ఫాంట్స్ ఉపయోగించాలి. ఇవి సాగే గుణం కలిగి ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి కాబట్టి సౌకర్యవంతంగా ఉంటాయి.

మార్కెట్లో పెద్దవాళ్ళు వేసుకునే స్కర్ట్స్ అందుబాటులో ఉంటాయి. టాప్స్ గా లూజ్ గా ఉన్న టీ షర్ట్ వేసుకుని స్కర్ట్స్ వేసుకుంటే సౌకర్యవంతంగానే ఉంటుంది. 

అమ్మాయిల ఎక్కువ ఎంపిక చుడిదార్లు, సల్వార్ కమీజ్లు. ఇవి ఎక్కువగా మార్కెట్లో లభ్యమయ్యేవి కూడా. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి.

భారతీయ సాంప్రదాయత ఉట్టిపడే చీరకట్టుకు మించిన సౌకర్యవంతం ఎందులోనూ ఉండదు. అయితే అలవాటును బట్టి ఇది ఆధారపడిపడి ఉంటుంది. 

వదులుగా ఉండే నూలు వస్త్రాలు ఏ సీజన్లో అయినా ఆడవారికి సౌకర్యవంతంగా ఉంటాయి. 

అనార్కలి టైప్ డ్రెస్సులు కూడా ప్రెగ్నెన్సీ మహిళలకు మంచి ఆప్షనే.

ఈమధ్య ఫాషన్ లోకి వచ్చిన ప్లాజో కూడా గర్భవతులకు బాగుంటాయి. వదులుగా ఉన్న పాంట్స్ కు తగ్గట్టు టాప్స్ కూడా సౌకర్యవంతంగా ఉంటాయివి.

ఈ విధంగా గర్భవతులు ఫాషన్ ను ఏ మాత్రం వదులుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు విభిన్న రకాలుగా తయారయ్యి అట్రాక్షన్ గా ఉండచ్చు. అయితే ఎంచుకునే రంగులు, శరీర తత్వాన్ని బట్టి బట్టల ఎంపిక ఆకర్షణను పెంచుతాయి. ఫైనల్ గా చెప్పేది ఒకటే శరీరానికి సౌకర్యం అనిపించినవి వేసుకోండి.

                                     ◆నిశ్శబ్ద.