తాతా ధిత్తై తరిగిణతోం 44

 

తాతా ధిత్తై తరిగిణతోం 44

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

 

అందుకే అక్కడున్న మేస్టర్లంతా ముందుగా ఆయనకు నమస్కారం చేసి తర్వాత చెప్పారు.

"వీరభద్రం మేస్టారు లోపలున్నారు పులుస్తాం. కూర్చోండి."

రంగారావు మేస్టారు లేచి, తన కుర్చీని ఆయనకు వేశారు.

"నిష్టాగరిష్టుణ్ణి తపోసపన్నుణ్ణి జింకచర్మంపై తప్ప ఇలాంటి కృత్రిమ ఆసనాలపై మేం కూర్చోం." అన్నాడు సాధువు నాటక ఫక్కీలో.

ఈలోగా వీరభద్రం ఇంట్లోంచి బయటకొచ్చి సాధువుణి చూశాడు.

"ఎవరదీ?" అన్నాడు.

"మేం సర్వేశ్వర నామధేయులం. సర్వసంగపరిత్యాగులం సాధువులం.

కాశ్మీరంనించి కన్యాకుమారికి కాలిబాటన యాత్ర సాగిస్తున్నవారం. మీ ఊరి మీదుగా  మేం ఈ పూటకు ఆతిథ్యం పొందుటకు మీ ఇల్లు తప్ప మరేదీ లేదని తెలుసుకున్నాం. అందుకే వెతుక్కుంటూ వచ్చాం" తన గడ్డాన్ని సవరించుకుంటూ చెప్పాడు సాధువు.

"మీ బోటి మహాన్భావులు మా గృహాన్ని పావనం చేయుట మా భాగ్యం అని భావిస్తాను. లోపలకు దయచేయండి ఇంతకుముందే మా ఇంట 'వ్రతం జరిగింది. తమరు తీర్థ ప్రసాదములు స్వీకరించి భోజనం చేద్దురుగాని" అంటూ సవినయంగా సాధువుని లోపలకు తీసుకెళ్లాడు వీరభద్రం.

"అయితే వీరభద్రుడంటే నువ్వేనన్నమాట" అతని వెంట నడుస్తూ అన్నాడు సాధువు.

ప్రాణస్నేహితుడైన చిదంబరం తప్ప వీరభద్రాన్ని అలా ఏకవచన ప్రయోగంతో సంభోదించేవారు ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరని చెప్పాలి. అయినా వీరభద్రం పట్టించుకోలేదు. ఎందుకో...ఆ సాధువుని చూసిన మరుక్షణమే అతనిలో భక్తి భావం ఏర్పడి పోయింది. ఆయనకు సకల మర్యాదలూ చేశాడు. సర్వోపచారాలూ చేశాడు.

తన భార్యనీ, నూతన వధూవరుల్ని ఆయనకు పరిచయం చేశాడు. అశ్వినీ, శ్రీరామ్ లు ఆయన పాదాలంటి ఆశీస్సులు తీసుకున్నారు. తన తాతల కాలంనాటిపులిచర్మం ఒకటి ఇంట్లో అటక మీద వుంటే, నారాయణతో దాన్ని క్రిందకు తీయించి, శుభ్రంగా దులిపించి ఆయన భోజనం పూర్తయ్యేసరికి వీదరుగుమీద వేయించాడు.

"నువ్వు అదృష్టవంతుడిని వీరభద్రుడూ. మంచిపిల్లని ఇంటికోడలుగా తెచ్చుకున్నావ్." పులిచర్మం ఒకటి ఇంట్లో అటక మీద వుంటే, నారాయణతో దాన్ని క్రిందకు తీయించి, శుభ్రంగా దులిపించి ఆయన  భోజనం పూర్తయ్యేసరికి వీదరుగుమీద వేయించాడు.

"నువ్వు అదృష్టవంతుడివి వీరభద్రుడూ. మంచి పిల్లని తెచ్చుకున్నావ్. పులిచర్మం మీద కూర్చున్నాక పక్కన చేరిన వీరభద్రంతో అన్నాడు సాధువు.

"చిత్తం. అంతా దైవ నిర్ణయం. అసలు నా మేనకోడలు ఈ ఇంటి కోడలుగా రావాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించక"

"పొరపాటు పరిస్థితులనుకూలించక పోవటం అనేది వుండదు. మనిషి తలచుకుంటే సాధ్యంకానిది ఉండకూడదు. ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మనమే మార్చుకోవాలి." హితబోధ చేస్తున్న ధోరణిలో చెప్పాడు సాధువు.

వీరభద్రానికి విషయమేమిటో అర్థం కాలేదు. మీరు శలవిస్తున్నదేమిటో  నాకు అవగతం కావటం లేదు" అన్నాడు.

"ఈ వివాహం విషయంలో నువ్వు తొందరపడ్డావు వీరభద్రుడూ?"

"అంటే?" అనుమానంగా చూస్తూ అడిగాడు వెంటనే.

"ఇందాకా నీ కోడల్ని చూశాను. బావుంది. యోగ్యురాలే సందేహంలేదు కానీ ఆమెముఖ కవళికలు మారకచిహ్నాల్ని ప్రస్పుటింపచేస్తున్నాయి."

"మారకమా? అంటే మ...మరణమా?" భయంతో చూశాడు వీరభద్రం.

"మరణం ఆమెకు కాదు...నీకు"

"న...నాకు...నాకు మరణమా?" వణుకుతున్న గొంతుతో అడిగాడు.

"భయపడకు భద్రుడూ. సర్వస్వాన్నీ త్యజించి సన్యాసినై, ఇరవై ఏళ్లు హిమాలయాల్లో ఘోరతపస్సు ఆచరించినవాణ్ణి అణిమాది శక్తుల్ని సాధించినవాణ్ణి నీకు తరుణోపాయాన్ని తెలియచేస్తాను. చేత్తో ఆశీర్వదిస్తూ చెప్పాడు సాధువు. అలాగే భయంతో చూస్తున్నాడు వీరభద్రం.

సాధువు కళ్ళు మూసుకున్నాడు...రెండు నిమిషాలు అలాగే మౌనముద్రలో వున్నాకా తర్వాత కళ్ళు తెరిచి చెప్పాడు.