Read more!

భక్తి ముక్తిదాయక స్వరూపుడు శ్రీసాయి

 

భక్తి ముక్తిదాయక స్వరూపుడు శ్రీసాయి

నేను ఇవ్వదలచుకున్నవి భక్తులు కోరటం ప్రారంభిస్తారనే ముందుగా నా భక్తులకు వారు కోరుకున్నవి అందిస్తాను” ఇది షిర్డీ సాయినాథుని ప్రవచన. భగవదవతారాలలో శ్రీ సాయి అవతారం మహోత్కృష్టమైనది. బాబా భక్తులకు చేసిన వాగ్దానాలలో ఈ వాగ్దానం సర్వోత్కృష్టమైనది. సాధారణంగా కోరికలు వదులుకోనిదే మోక్షం కలగదని మన వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మరి, శ్రీ సాయి తన వద్దకు వచ్చే వారిని కోరికలతోనే రమ్మంటున్నారేమిటి? అనే సందేహం కలుగవచ్చు. దీనికి బాబా ఇలా సమాధానం చెప్పారు.

“నిత్యం నన్నే స్మరించి, ధ్యానించి, పూజించే భక్తుల కోరికలు తీరుస్తాను, కష్టాలు ఎడబాపుతాను. మనిషి జీవితంలో కష్టాలు, చింతలు, కలతలు తీరిపోతే మనసు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనిషి తన దృష్టి భగవంతుని పైకి సారిస్తాడు. కోరికలతో భగవంతునిపై దృష్టి పెట్టడానికి, కోర్కెలు తీరిన తర్వాత దృష్టి సారించడానికి ఎంతో తేడా ఉంది. కోరికలు, వ్యామోహాలు తీరిపోయిన మనిషి జ్ఞానం కోసం భగవంతునిపై మనసు లగ్నం చేస్తాడు. తానెవరో తెలుసుకుంటాడు. తనను తాను ఆత్మజ్ఞానంతో తెలుసుకున్న మనిషి ఏదైనా సాధిస్తాడు”

భక్తుల శ్రేయస్సు కోసం తాపత్రయపడే దైవం బాబా. కోరికలు తీర్చే చేత్తోనే జ్ఞానాన్ని ప్రసాదించే భక్తిముక్తిదాయక స్వరూపం షిర్డీ సాయినాథుడు. అందుకే బాబా భక్తసులభుడయ్యాడు. కోరికలు తీర్చే కల్పవృక్షం. చింతలు తీర్చే చింతామణి. అడిగినవన్నీ ఇచ్చే కామధేనువు. షిర్డీ సాయినాథుని దయవల్ల మన కోరికలన్నీ తీరుతున్నాయి. సంకల్పాలన్నీ నేరవేరుతున్నాయి. మనసు ఏకాగ్రమూ, ప్రశాంత చిత్తమూ అవుతోంది. ఇక ఇప్పుడు మనం బాబాను కోరుకోవలసింది జ్ఞానమే. బాబా ఉపదేశాల్లోని సారాన్ని గ్రహిద్దాం. సాయి తత్త్వాన్ని ఒంటపట్టించుకుందాం. బాబా లీలల్లోని అంతరార్థం అవగతం చేసుకుందాం. బాబా ఏం చెబుతున్నారో విందాం.

“నేను ఏం చెబుతున్నానో గ్రహించేవారు ఒక్కరూ లేరు. నా ఖజానాలో ఆధ్యాత్మిక జ్ఞానమనే ధనం నిండుగా ఉంది. ఎవరికి కావలసింది వారు బండ్ల కొద్ది తీసుకుపోవచ్చు” అని బాబా ఆహ్వానిస్తున్నారు.

సాయి నామమే ఈ విశ్వంలో దివ్యధామం
‘సా’ అంటే సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం.
‘యి’ అంటే ఇలపైనే జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్యౌషధం.
‘సాయి’ నామంలో సర్వశక్తులూ ఇమిడి ఉన్నాయి.

సాయి బోధనల్ని స్ఫూర్తిగా తీసుకుంటే అనంతమైన శక్తి సామర్ద్యాలు సొంతమవుతాయి. సాయి తత్త్వాన్ని ఒంటపట్టించుకుంటే అద్భుతమైన వికాసం పురివిప్పుతుంది. సాయి పథం ఆదర్శ సంఘ జీవనానికి, వ్యక్తిత్వ వికాస సంపన్నతకు బాటలు వేస్తుంది. బాబా చెప్పినట్టు స్వార్థంతో తన కోసమే తాను చేసుకునే ప్రార్థనకు ఫలితం ఉండదు. అది తనతోనే అంతమైపోతుంది. ఇతరులకోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. మనందరి యోగక్షేమాలను కాపాడే సర్వ శ్రేయోదాయి శ్రీ సాయి చెంతనుండగా మనకు స్వార్థం, అహం ఎందుకు? సాయి బంధువులమైన మనం అందరికోసం అడుగువేద్దాం. అదే సాయి పథం.