మనిషి అంతిమ మార్గానికి దారిచూపే శ్లోకం!!

 

మనిషి అంతిమ మార్గానికి దారిచూపే శ్లోకం!!

జ్ఞానమార్గం, అజ్ఞానమార్గం అని రెండు ఉంటాయి. మనిషి కొన్నిసార్లు తాను నమ్మించి జ్ఞానమార్గం అనుకుంటాడు. తాను సరైన మార్గంలో వెళ్తున్నానని అదే సమంజసమని అనుకుంటాడు. కానీ సరైన పలితాన్ని పొందలేకపోతాడు. కారణం ఏమిటంటే ఇదిగో గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు.

శుక్లకృష్ణ గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే!

ఏకయా యాత్యనావృత్తిమన్యయాం వర్తతే పునః॥

శుక్ల మార్గము కృష్ణమార్గము ఈ జగత్తులో శాశ్వతంగా ఉంటాయి. శుక్లమార్గంలో పయనిస్తే జన్మఉండదు, కృష్ణమార్గంలో పయనిస్తే తిరిగి జన్మ ఉంటుంది. అసలు విషయం ఈ శ్లోకంలో వివరించాడు. ఉత్తరాయనము దక్షిణాయనము రెండూ ఈ లోకంలో ఉన్నాయి. ఉత్తరాయనము ఆరునెలలు, దక్షిణాయనము ఆరు నెలలు. ప్రతి అయనంలోనూ, ప్రతి నెలలోనూ శుక్లపక్షము, కృష్ణపక్షము రెండు వస్తుంటాయి. అంటే ఉత్తరాయనము శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదనీ, అలాగే ఉత్తరాయనము కృష్ణపక్షంలో మరణిస్తే తిరిగి జన్మిస్తాడనీ, అలాగే దక్షిణాయనము శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదా! కృష్ణపక్షంలో మరణిస్తే జన్మ ఉంటుందా! అనే సందేహాలకు సమాధానమే ఈ శ్లోకము. వాడుకభాషలో ఉత్తరాయనము, దక్షిణాయనము, శుక్లపక్షము, కృష్ణపక్షము అంటే కాలానికి సంబంధించినవి. ఇక్కడ వాటిని అంటే జ్ఞానమార్గము, అజ్ఞానమార్గము అనే వాటికి అన్వయించుకోవచ్చు. 

ఉత్తరాయనం అన్నా శుక్లపక్షం అన్నా జ్ఞానమార్గమనీ, దక్షిణాయనము అన్నా కృష్ణపక్షము అన్నా అది అజ్ఞానమార్గమని గ్రహించాలి. జ్ఞాన మార్గము అంటే శాస్త్రములు అధ్యయనం చేయడం, జ్ఞానం సంపాదించడం, దానిని ఆచరణలో పెట్టడం, నిష్కామ కర్మలు చేయడం, మనసును ఆత్మలో లీనం చేయడం, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం. ఈ మార్గంలో ప్రయాణిస్తే మరలా జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యం కలుగుతుంది. ఇంక అజ్ఞాన మార్గము అంటే కేవలం శ్రద్ధ, భక్తి లేకుండా ఆడంబరం కోసం, తన కోరికలు తీరడం కోసం భగవంతుని పూజించడం. అవసరాలకు మాత్రమే పరమాత్మ గుర్తుకు రావడం. 

అజ్ఞానంతో కర్మలు చేస్తూ, ఆ కర్మఫలములను అనుభవించడానికి మరలా మరలాజన్మలు ఎత్తుతుంటారు. ఇదే కృష్ణమార్గము. జ్ఞానము ప్రకాశవంతమైన దారి. అజ్ఞానము చీకటి దారి. ఈ మార్గాలు ఎవరూ ఏర్పరచలేదు. "శాశ్వతే" అంటే అనాది నుండి ఈ రెండు మార్గాలు శాశ్వతంగా ఈ లోకంలో ఉన్నాయి. స్వతస్సిద్ధంగా ఏర్పాడ్డాయి. జ్ఞానమార్గం అనే ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన మార్గంలో ప్రయాణం చేసి ముక్తి పొందుతావో, అజ్ఞాన మార్గం అనే చీకటి మార్గమును ఆశ్రయించి పునర్జన్మలను పొందుతావో నీ ఇష్టం. ఎంచుకునే అవకాశాన్ని మనిషికే వదిలేసాడు పరమాత్మ. ఇప్పుడు మనం మన తెలివిని ఉపయోగించి ముక్తిని కోరుకుంటామో మరలా జన్మలను కోరుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి అంతే కానీ జీవితాంతం చేయకూడని పనులు చేసి ఉత్తరాయనం, శుక్లపక్షంలో పోతే మోక్షం రాదు. అలాగే జీవితాంతం పవిత్రంగా బతికి దక్షిణాయనం కృష్ణపక్షంలో పోతే పునర్జన్మరాదు. జనన మరణాలు మనచేతిలో లేవు. 

కాబట్టి, మనం నిష్కామకర్మలు చేసి, శాస్త్రములను చదివి, విని, గురువుల వద్ద జ్ఞానం సంపాదించి, ప్రకాశవంతమైన మార్గంలో నడవాలేగానీ, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో, విషయభోగములలో మునిగి తేలుతూ అజ్ఞానాంధకారంలో పడి పోయి చీకటి దారిలో ప్రయాణం చేయకూడదు.

◆ వెంకటేష్ పువ్వాడ