Read more!

కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు ....4

 

 

కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు ....4

మహబూబ్ నగర్ జిల్లా

 


                                                                                                
కర్ణాటకాలో అనేక ప్రాంతాలను దాటుకుంటూ కృష్ణవేణమ్మ తెలంగాణా రాష్ట్రంలో అడుగు పెడుతుంది.  ఇక్కడ కృష్ణా తీరంలోని కొన్ని ఆలయాలను దర్శిద్దాము.

 

ఆంజనేయస్వామి ఆలయం, బీచుపల్లి

మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాలలో కృష్ణా నది ఒడ్డున ఉంది బీచుపల్లి.  ఈ గ్రామము 7వ నెంబరు జాతీయ రహదారి మీద వున్నది.   ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు.  జాతీయ రహదారి ప్రక్కనే వుండటంతో లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు చెయ్యటానికి ఇక్కడికి వస్తూవుంటారు. ఇక్కడ కృష్ణానది పక్కన పురాతనమైన  ఆంజనేయస్వామి దేవాలయం వున్నది.  ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారంటారు.  అయితే తర్వాత కాలంలో ఈ ఆలయం మరుగున పడిపోయింది.  తర్వాత వ్యాస రాయలుచే పునః ప్రతిష్టించబడింది అంటారు.

 

 

స్థల పురాణం..

శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాస రాయలవారు అనేక ప్రాంతాలు తిరిగి అనేక ఆంజనేయస్వామి ఆలయాలని నిర్మించారు.  ఆయన దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చి కృష్ణా నదిలో  స్నానం చేసి విడిచిన తడి బట్టలను శిష్యుడు  నదిలోని ఓ రాయిపై ఉతుకుతుంటే.. ఆ రాతి నుంచి శబ్దాలు వినిపించాయట.   రాతిని పరీక్షించి చూడగా ఆంజనేయస్వామి ప్రతిమ కనిపించిందట.  స్వామిని సురక్షితమైన ప్రదేశంలో ప్రతిష్టిద్దామని, తీసుకువచ్చే ప్రయత్నంలో అంత పెద్ద రాయిని మోయలేక స్వామిని బరువు తగ్గమని వ్యాసరాయలు ప్రార్థించారుట.   దాంతో స్వామివారు నిజంగానే బరువు తగ్గారని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. వ్యాసరాయలు భుజాలపై స్వామివారిని మోసుకుంటూ వస్తుండగా.. ఓ రావి చెట్టు దగ్గరకు రాగానే మళ్లీ స్వామి బరువు పెరిగారని.. అదే అనువైన ప్రదేశంగా భావించి ఆ చెట్టుకిందే స్వామివారిని ప్రతిష్టించారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు.

 

 

వ్యాస రాయలు విస్తృతంగా పర్యటించి అనేక ప్రదేశాలలో ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించాడు.  దానిలో ఇదీ ఒకటి.    వ్యాస రాయల ప్రతిష్ట లో హనుమంతునికి ఇరువైపులా శంఖ,చక్రాలుంటాయి. ఆయన ఇక్కడ హనుమంతున్ని ప్రతిష్టించి,మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని చెప్పాడట. అప్పుడక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బోయపిల్లవాడు వచ్చాడనీ, అతనినే పూజారిగా నియమించారుట.  అప్పటి నుండి బీచుపల్లిలో స్వామివారికి బోయవారిదే ప్రథమ పూజ. అతని పేరుమీదే ఆ ఊరు బీచుపల్లి అయిందిట.    క్రీ.శ.1961  వ సంవత్సరం లో  గద్వాల వాస్తవ్యులైన  కె.పి.వర్ధన్ ఇక్కడ  శ్రీ రామకోటి యాగం చేశారు.   అప్పటినుంచీ ఈ క్షేత్రం గురించి అందరికీ తెలియసాగింది. బీచుపల్లిలో శ్రీఆంజనేయస్వామి ఆలయంతో పాటు కోదండరామస్వామి ఆలయం, శివాలయాలు కూడా వున్నాయి.  కృష్ణా నదిలో స్నానం చేసిన భక్తులు ముందుగా దగ్గరలోనే వున్న శివాలయంలో స్వామి దర్శనం చేసుకుంటారు.

 

 

కూడవల్లి (కూడలి సంగమేశ్వరాలయం, అలంపూర్), తెలంగాణా

తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశంలో వున్నది ఈ ఆలయం.  శ్రీ శైలం డ్యాం నిర్మాణ సమయంలో ముంపుకు గురి అయిన ఈ ఆలయాన్ని యధాతధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో  ప్రసిధ్ధికెక్కిన జోగులాంబ శక్తిపీఠం సమీపంలో పునర్నిర్మంచారు. ఈ ఆలయం  బాదామీ చాళుక్యులచే నిర్మింపబడినదే.  ఈ ఆలయంలో చక్కని శిల్ప సంపద చూడవచ్చు.  నిర్మాణ శైలి, శిల్ప, ఆగమ సంప్రదాయాలు అత్యున్నత రీతులో వున్నాయని శ్లాఘించబడిన ఆలయం.  ఈ ఆలయం 7 – 8 శతాబ్దాల నాటిదిగా గుర్తించబడింది.

 

 

ఈ ఆలయంలో శిల్పకళ అత్యంత విశిష్టమైనది.  ఆలయానికి ఒక మూలగా వున్న మొసలి నోటిలో వున్న యువతి శిల్పం ఒక వైపు నుంచి చూస్తే బాలికగా, ఎదురుగా చూస్తే ప్రౌఢగా, మూడోవైపునుంచి చూస్తే వృధ్ధురాలిగా కనిపించటం శిల్పి అద్భుత చాతుర్యానికి నిదర్శనం.  అర్ధ నారీశ్వర శిల్పం, ఇంకా అనేక శిల్పాలేకాక గోడలమీద, కిటికీలమీద రకరకాల అద్భుతమైన డిజైన్లు చూడవచ్చు. జోగులాంబ ఆలయానికి సుమారు 2 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయం గురించి తగిన శ్రధ్ధ తీసుకోవటం లేదనిపిస్తుంది.  సందు మొదట్లో వున్న ఒక బోర్డు తప్పితే ఇతర ప్రచారమేమీ లేదు.  సరైన వివరాలు లేవు.

 

దీనికి కిలో మీటరు దూరంలో వున్న పాపనాశని ఆలయ సమూహం కూడా కృష్ణానది ముంపుకు గురయితే తీసుకు వచ్చి ఇక్కడ పునర్నిర్మాణం గావింపబడిన ఆలయాల సమూహమే.  వీటికి దగ్గరలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం, బ్రహ్మేశ్వరస్వామి దేవాలయాల సమూహం వున్నాయి.

 

రేపు మహబూబ్ నగర్ జిల్లాలోని మరి కొన్ని ఆలయాలు.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)