Read more!

బాబా ఆదర్శ బోధనలు

 

సాయి బోధనలు ప్రేమ, దయ, సహనం, వినయం, విధేయత, సత్ప్రవర్తన, సేవా భావాల వైపు మళ్లిస్తాయి. సామాన్యులకు అర్థం కాని వేదాలు, పూరాణాల్లోని సారాన్ని బాబా అరటిపండు వలిచి చేతికి అందించినట్లు సులభంగా అర్థమయ్యేలా చెప్పారు.

సాయి రూపాన్ని ధ్యానిస్తే మదిలో కలిగే వికారాలు విరిగిపోతాయి. అజ్ఞానపు చీకట్లు, అహంకారం, మనో మాలిన్యాలు తొలిగిపోతాయి. అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుతమూర్తి మన సాయి. ప్రేమ తత్వమే సాయితత్వం. బాబాకు, ధనిక, బీద, చిన్నా పెద్దా తారతమ్యాలు లేవు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించటానికి, ఆదర్శ జీవనానికి బాటలు వేసి, జీవిత పరమార్థాన్ని చాటటానికి ఈ భువిపై మానవ రూపంలో అవతరించిన దైవం సాయిబాబా. బాబా తన బోధనల ద్వారా మనుషుల్ని సాధన మార్గంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖారాలకు చేరుకోవటానికి దారి చూపించారు.

మహిమలతో కాదు మానవత్వంతో బతకాలని చాటి చెప్పారు. సాధారణ జీవితం గడిపి మన జీవితాల్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడిని అని చెప్పుకున్న వినయ భూషణుడు. బాబా లాంటి మహనీయులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని త్యజిస్తారు. అయితే ఆ లీలలను సాక్షాత్కరింప చేయడంవల్ల అవెప్పటికీ సజీవంగా ఉంటాయి. బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం! బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన! బాబా లీలలు దుష్టబుద్దులను పోగొట్టి, మంచి అలవాట్లను, ఆలోచనలను కలిగిస్తాయి.

బాబా మహిమలు మనో వికారాలను రూపుమాపి, జీవితాన్ని బంగారుబాటలో నడిపిస్తాయి. బాబా సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు!!! బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్తానికి దిక్సూచి!!!!! సాయి తత్వంలో జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని ఒంటబట్ట్జించుకునే బతుకు ఆనందనంద నమవుతుంది. జీవితం ధన్యమౌతుంది. నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయి తత్వమే.