ఆషాఢమాసంలో కూడా మంచి రోజులు ఉంటాయి..

 

ఆషాఢమాసంలో కూడా మంచి రోజులు ఉంటాయి..

 

 

ఆషాఢమాసము అంటే శూన్య  మాసము అంటారు. వివాహము వంటి వాటికి ముహుర్తములు ఉండవు. ఎలాంటి శుభ కార్యాలు ఉండవు అని అంటారు. కానీ ఒక్కసారి పరికించి చూస్తే భానుడి గ్రీష్మ తాపానికి హడలి పోయిన ప్రపంచానికి  ఆషాఢ మాసం అంటే తొలకరి జల్లులు, మట్టి తడిసిన వాసనలతో పుడమి పులకింతలు, లేత చిగుర్లు, కాగితం పడవలతో ఆటలు, మొలకెత్తిన విత్తనాలు, కొత్త అల్లుళ్లకు ఆషాఢ పట్టీ వినోదాలు,తక్కువ ధరలతో మార్కెట్ల హోరు, గోరింటాకుతో ముదితల ఆనందం, అమ్మ వారికి భోజనం, బోనం, గురువులను ఆరాధించే సమయము గురు పౌర్ణమి, స్థితికారుడైన విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయము, తొలి ఏకాదశి, నదులు పరవళ్లు తొక్కుతూ సముద్రుడిని  చేరుకోడానికి ఆరాట పడుతూ వెళ్లే సమయము, సన్యాసాశ్రమములో ఉన్నవారు చాతుర్మాస్య వ్రతాన్ని తాము ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రారంభించే కాలము. ఒకటా రెండా, సంస్కృతి, సంప్రదాయము,ఆధ్యాత్మికత, ఆచారం, ఆనందం,కోలాహలం ఇన్నిటి కలయిక మన ఆషాఢ మాసము.


అయితే ఎందుకు ఇన్ని రకాల వైవిధ్యములు ఈ మాసంలోనే ఉన్నాయి అంటే, మనది భారత దేశము. భారత దేశము వ్యవసాయాధారిత దేశము. అంతే కాకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతో పట్టిష్టంగా ఉన్న దేశము. ఆషాఢ మాసము వర్షాలు పడడము ప్రారంభము అయి వ్యవసాయం కోసం ఇంట్లో వారంతా కష్టపడి పని చేసేందుకు ముందుకు వెళ్ళవలసిన సమయము. అందుకే అత్తా, కోడళ్ళు ఒక చోట ఉండకూడదన్న నియమం పెట్టి కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటికి పంపే ఒక ఆచారం పెట్టారు మన పెద్దలు.  అప్పుడే  పెళ్లి అయ్యి కొత్తగా వేరే వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయి,  పుట్టింటికి కొంత కాలం వెళ్లి నప్పుడు ఇక్కడికి, అక్కడకు ఉన్న సామ్యం ఏమిటి? ఏ విషయంలో వైవిధ్యం ఉంది? వేరుగా ఉన్నారు అన్న విషయం ఒకసారి మానసికముగా తరచి చూసుకుని అత్తగారి ఇంటికి తగినట్లుగా తనను తాను మలచుకోవడానికి ఒక చక్కని అవకాశము. అలాగే అప్పటి వరకు ఇంట్లో తిరిగిన కోడలు కొంత కాలము కనిపించక పోవడంతో అయ్యో, కోడలు కనిపించడం లేదు అన్న బాధ అత్త, మామలకు కలగడం, ఇంట్లో మిగిలిన వారికీ కలగడంతో, ఒకరిపై ఒకరికి ఆప్యాయత పెరిగి, ఆ మాసము అయిపోగానే ఆ అమ్మాయి తిరిగి వచ్చినప్పుడు అత్యంత ఆదరంతో ఆ అమ్మాయికి ఆహ్వానం పలుకుతారు అని మన పెద్దలు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఒక సత్సంప్రదాయం ఇది. అంతేకాకుండా, ఈ మాసములో కనుక ఆడపిల్ల గర్భము ధరిస్తే, ప్రసవం అయ్యేవరకు భానుడు చండ ప్రచండంగా ఉంటాడు. అంటే దాదాపు మే నెలలో అలాగ ప్రసవం అయ్యే సమయము . ఇప్పుడు అంటే అన్ని వసతులు ఉన్నాయి కనుక ఇబ్బంది కాదు కానీ, ఈ ఆచార,వ్యవహారములు ఈ మాసములో పెట్టినప్పుడు ఇన్ని వసతులు, ఇన్ని సౌకర్యాలు లేవు కనుక అంత ఎండాకాలంలో ప్రసవం అయితే పుట్టిన బిడ్డకు, తల్లికీ ప్రమాదం కనుక, అలాంటి కష్టం రాకూడదు అన్న ఆలోచనతో ఈ నెలలో అమ్మాయిని పుట్టింటికి పంపించడం అనేది దూరపు చూపుతో, అంటే ముందు చూపుతో నిజానికి  మన పెద్దలు ఏర్పరచిన ఒక సత్సంప్రదాయము.


ఆ తరువాత ఈ నెలలోనే నిజానికి వివాహం వంటి వాటికి ముహుర్తాలు లేక పోయినా కూడా, పుడమి పులకించడంతో ఎక్కడ చూసినా కూడా హరిత హారములాకనిపిస్తూ  ఉంటుంది.ఎక్కడ చూసినా కూడా ఏదోలా దుమ్ము,ధూళితో ఉన్న చెట్లు అన్నీ తొలకరి జల్లులకు తలంటి పోసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. చక్కగా ప్రకృతి అంతా పులకరింతలతో ఉంటుంది. ఇక గోరింటాకు. ఆయుర్వేదపరంగా కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న గోరింటాకుని ఈ కాలములో పెట్టుకోవాలి అని చెప్పి పెద్దలు చెపుతూ ఉంటారు. ఎందుకు అంటే వర్షాలకు తడుస్తూ, ఎండుతూ, నానుతూ ఉన్న ఈ సమయములో రక్తములో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. అందులో ఆడపిల్లలు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు నీటిలో ఎక్కువగా నానుతూ ఉంటారు.దాని వల్ల వారికి ఈ కాలములో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి చక్కటి గోరింటాకు ఆకులు తీసుకుని నూరుకుని పెట్టుకోవడం ద్వారా వారికి రక్తంలో వచ్చే దోషాలు రాకుండా ఉంటాయి కనుక ఈ కాలములో గోరింటాకు పెట్టుకుని తీరాలి అనే ఒక అలవాటును  ఒక సత్సంప్రదాయముగా  పూర్వ కాలం నుంచి పాటిస్తూ వచ్చారు.


ఆ తరువాత, నిజానికి అనాది కాలం నుంచి మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఎంతో బలముగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది కానీ  ముందుగా సృష్టికి మూలమైన తల్లి, స్త్రీ నే ఎక్కువ అనే మాతృ స్వామ్య వ్యవస్థ ఎంతో బలముగా ఉండేది. అలాంటి మాతృ మూర్తిగా నదులను, చెట్లను ఇలాంటి వాటిని గౌరవించడము, పూజించడం అనేది భారతీయ సంప్రదాయములో ఒక భాగముగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు వర్షాలు మొదలు అయ్యి మరలా ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందుతున్న ఈ సమయములో ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి  భోజనం పెట్టి కృతజ్ఞతలు చెప్పడం అన్న ఒక ఆచారమే భోజనం కాస్తా , ఆ తరువాత బోనం గా మారింది. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి బోనం పెట్టడం అనేది ఈ నెలలోనే చేయడం ఆచారంగా కూడా వచ్చింది. అంటే ఏదైనా ప్రారంభంలోనే అమ్మ వారికి ముందుగా భోజనం పెట్టి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళితే మంచి  జరుగుతుంది అని . అంటే తల్లి తండ్రులను ముందుగా గౌరవించడం అనే చక్కని సంప్రదాయాన్ని ఈ మాంసములో మనం ఈ పండుగల ద్వారా చూస్తూ ఉంటాము.


 ఆ తరువాత ఎన్నో ఏళ్ల తరబడి ఒక ఇంటి తలుపులు మూసి చీకటిలో ఉన్నా కూడా, ఒక చిన్న దివ్వె తీసుకుని లోపలకు వెళితే అని ఏళ్ల తరబడి ఉన్నా ఆ చీకటి కూడా పటాపంచలు అయిపోతుంది. అలాగే ఎన్నో జన్మల నుంచి మనం సంతరించుకుంటూ వచ్చిన పాప,పుణ్యాలు, మంచి, చెడు అన్నీ కూడా సద్గురువు ఆశీస్సులు లభిస్తే వెంటనే సన్మార్గము లభిస్తుంది అని పెద్దలు చెపుతారు. అందుకే సద్గురువును  ఈ మాసములో వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అనే పేరుతో ఆదరించడం, గౌరవించడము, పూజించడం ఆశీస్సులు పొందడం కూడా ఈ నెలలోనే వచ్చింది.


నిజానికి పూజలు, వ్రతాలూ, నోములు,వివాహము వంటివి అన్నీ కూడా సాధారణ గృహస్తుకు ఉంటాయి. కానీ ఈ ఆషాఢ మాసములో ప్రత్యేకత ఏమిటి అంటే ఏ బాదర బందీ  లేక సన్యాసాశ్రమములో ఉన్నవారు కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంది చాతుర్మాస్య వ్రతం చేయడం అనేది ఈ ఆషాఢ మాసములోని ప్రారంభము అవుతుంది. నిజానికి ఎందుకు ఇలా చేయాలి అంటే, సన్యాసాశ్రమములో ఉన్నవారు, సన్యాసి అయిన వారు నిజానికి ఒక చోట ఎక్కువ కాలము ఉండకూడదు. మరి ఆనియమాన్ని అతిక్రమించి నాలుగు నెలల పాటు ఒక చోట ఎందుకు ఉండాలి? దానికి ఆరంభం ఆషాఢ మాసములో ఎందుకు అవుతుంది అంటే నదులన్నీ కూడా ఎక్కడెక్కడ నుంచో ప్రవహిస్తూ ఉంటె, వరద నీరు, మురుగు నీరు కూడా చేరుతూ ఉంటాయి.అలా వేగగగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అన్నీ నదులలో కలిసిపోతూ ఉంటాయి. సన్యాసాశ్రమములో ఉన్నవారు ఈ నదీతీరాల వెంట ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా వెళుతూ ధర్మ ప్రచారము చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీరికి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఉండడంతో పాటు, వారు నదులలోనే స్నానము చేయాలి సాధారణముగా. అయితే ఈ నాలుగు నెలలు నదీ స్నానము నిషిద్ధము. అంటే కాకుండా ఇప్పటి రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలికగా వెళ్లగలము. కానీ పూర్వ కాలములో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళాలి అన్న నడిచి వెళ్లాల్సిందే. ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలలు వర్ష ఋతువే. 


ప్రయాణ సౌకర్యాలు బాగా ఉండవు. నడిచి వెళ్ళడానికి అనువుగా ఏదీ ఉండదు. అందుకని ఈ నాలుగు నెలల కాలం మాత్రము సన్యాసాశ్రమములో ఉన్నవారు తాము ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి చాతుర్మాస్య వ్రతము చేయవలసి ఉంటుంది.ఏమిటీ చాతుర్మాస్య వ్రతము అంటే నాలుగు నెలలు ఒక చోట ఉండడంతో పాటు చంద్రుడి కళలు అనుగుణముగా అంటే చంద్రుడి కళలు పెరిగే కొద్దీ ఆహరం తగినట్లుగా తీసుకుంటూ, చంద్రుడి కళలు క్షీణిస్తూ ఉంటే ఆహరం తగ్గిస్తూ, ఎక్కువ సమయము అనుష్ఠానములో ఉంటారు. మౌనవ్రతం ఆచరిస్తారు. ఉపవాసములు చేస్తారు. ఇలా చేస్తూ భగవంతుడి వైపుగా అభిముఖం అవుతూ ఆత్మోన్నతి పైన ఎక్కువ దృష్టి పెడతారు. తద్వారా ఒక చోట అంతకాలం ఉన్న దోషం కూడా పోతుంది. ఈ విషయం గురించి చెప్పినప్పుడు కంచి కామ కోటి పీఠాధిపతిగా చేసిన శ్రీ శ్రీ శ్రీ. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి చెప్పక పొతే ఇది అసంపూర్ణం అవుతుంది. ఈ మహానుభావుడు 13 ఏట సన్యసించి కామకోటి పీఠానికి అధిపతి అయ్యారు. నిండు నూరేళ్లు బ్రతికి వందవ సంవత్సరం తరువాత పరమాత్ముని చేరుకున్నారు. 87 చాతుర్మాస్యములు చేశారు ఈ మహానుభావుడు. సాధారణముగా సన్యాసి ఎవరికీ నమస్కరించకూడదు. తనకంటే ఎక్కువ చాతుర్మాస్యములు చేసిన వారికి మాత్రమే నమస్కరించాలి. ఈ మహానుభావుడు ఎంత గొప్పగా ఈ వ్రతాచరణ చేశారంటే తాను   87  వ్రతాలు చేశారు కనుక అంతకంటే ఎక్కువ చేసిన వారు అంటూ ప్రపంచములో లేక పోవడంతో తాను నమస్కరించడానికి ఒక వ్యక్తి ప్రపంచములో లేనంత గొప్పగా జీవించారు. అటువంటి మహానుభావులు మన భారత దేశములో నడయాడారు. వీటన్నిటికీ కూడా మన ఆషాఢ మాసమే ఆయువు పట్టు.అవన్నీ అర్ధము చేసుకుని మన పెద్దలు పెట్టిన చక్కని సంప్రదాయాలను అనుసరిస్తూ, వేరే వారి ఆచారములు గౌరవిస్తూ, అర్ధం చేసుకుంటూ జీవితమును సఫలం చేసుకుందాము.    

https://www.youtube.com/watch?v=CdblqwS47lM