కెరీర్ లో ఇబ్బందులు ఉన్నాయా.. ఈ పరిహారాలు పాటించండి..!

 

కెరీర్ లో ఇబ్బందులు ఉన్నాయా.. ఈ పరిహారాలు పాటించండి..!

ప్రతి ఒక్కరు తమ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటారు. చాలా సార్లు కష్టపడి పనిచేసినప్పటికీ, కెరీర్‌లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.    ఇబ్బందులను అధిగమించి మరీ కష్టపడినా దానికి తగిన ఫలితం,  కెరీర్ లో ఎదుగుదల  లేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏ ఉద్యోగం ఎక్కువ కాలం నిలవకపోవడం,  లేదా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఉద్యోగం చేతికి వచ్చినట్టే వచ్చి చెయ్యి జారిపోతుంటుంది.  ఇలాంటి సంఘటనల వల్ల జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది.  ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలా కాకుండా ఉద్యోగం లభించాలన్నా, కెరీర్ లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగాలన్నా జ్యోతిష్క శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొన్నారు.  ఆ పరిహారాలు పాటిస్తే కెరీర్ లో ఎదురయ్యే ఇబ్బందులు మాయమవుతాయి.  ఇంతకూ కెరీర్ కోసం పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకుంటే..

సూర్యుడి అర్ఘ్యం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు ఆత్మవిశ్వాసం, నాయకత్వం,  ప్రభుత్వ రంగానికి సంబంధించిన గ్రహం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేచి, స్నానం చేసి.. రాగి పాత్రలో సూర్య భగవానుడికి  అర్ఘ్యం సమర్పించాలి. ఇందులో నీరు, ఎర్రటి పువ్వులు, తృణధాన్యాలు కలపాలి. ఇది మనోధైర్యాన్ని పెంచుతుంది,  కొత్త కెరీర్ అవకాశాలను సృష్టిస్తుంది. అర్ఘ్యం సమర్పించే అలవాటును ఆదివారం నుండి మొదలు పెట్టడం మరీ మంచిదని చెబుతారు.

శని దేవుడి ఆరాధన..

శని గ్రహం కర్మలు,  క్రమశిక్షణ,  కష్టపడే స్వభావానికి  ప్రతీక. ఎంత కష్టపడినా తగిన ఫలితాలు లేకపోతే శనివారం రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలి.  అలాగే, "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా చేయడం వల్ల  ఉద్యోగానికి సంబంధించిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి.

ఆంజనేయస్వామి ఆరాధన..

అన్ని అడ్డంకులను తొలగించి  బలాన్ని,  జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆంజనేయస్వామి. మంగళవారాలు,  శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసి, రామ నామాన్ని జపించాలి. ఆయనకు బెల్లం,  శనగలు నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వల్ల  ధైర్యం  పెరుగుతుంది.   పోటీ రంగాలలో విజయం సాధించడంలో సహాయకరంగా ఉంటుంది.

గురువారం పరిహారం..

ఎంత ప్రయత్నం చేసినా ఎంత కాలం గడిచినా ఉద్యోగం దొరకకపోతే గురువారం నాడు 11 మంది ఆడపిల్లలకు  పసుపు రంగు దుస్తులు ఇచ్చి, వాటిని ధరించమని చెప్పాలి తర్వాత వారికి పెసరపప్పుతో వండిన ఆహారం, తీపి పదార్థాలు, పండ్లు ఆహారంగా వడ్డించాలి. శక్తి మేరకు వారికి దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం బలోపేతం అవుతుంది.   విద్య,  వృత్తి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.


పైన పేర్కొన్న పరిహారాలు వివిధ సందర్బాలలో జ్యోతిష్క నిపుణులు, పురాణ పండితులు చెప్పినవి. వీటిని పాటిస్తూ ఉంటే కెరీర్ సంబంధిత సమస్యలు తొలగిపోయి కెరీర్ మళ్లీ వేగం పుంజుకుంటుంది.

                                  *రూపశ్రీ.