Read more!

Akshaya Tritiya Gold

 

అక్షయ తృతీయ ప్రత్యేకత ఏమిటి?

Akshaya Tritiya Gold

అక్షయ తృతీయ ఆడవాళ్ళకు మహా ఇష్టమైన పండుగ. ఇది సంపదలకు గుర్తుగా చెప్పే రోజు. పసిడి రాశుల పర్వదినం. ఈరోజు బంగారం కొంటే మంచిదనే నమ్మకంతో ఎవరికి వారు తమ తాహతు కొద్దీ కొంటారు. కొనగలిగిన వారు పెద్ద పెద్ద ఆభరణాలు, రాశులకొద్దీ గోల్డు కొంటే, అంత శక్తి లేనివారు ఒక గ్రాము బంగారం అయినా కొని సంతృప్తి చెందుతున్నారు.

అక్షయ తృతీయ అంటే అర్ధం తెలుసా? అక్షయం అంటే క్షయం కానిది. అంటే క్షీణించకుండా శాశ్వతంగా ఉండేదన్నమాట. అందుకే బంగారం, స్థలాలు, పొలాలు లాంటి విలువైన వాటిని అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తారు. సామాన్యంగా పసిడి ఎప్పుడు కొన్నా మంచిదే. అది అలంకారానికి ఉపయోగపడటమే కాదు, అవసరమైన సమయాల్లో అక్కరకు వస్తుంది. అమ్ముకోవాలనే ఉద్దేశం కొనేటప్పుడు లేకున్నా ఒకవేళ అత్యవసరమైతే కనుక అందుక్కూడా పనికొస్తుంది. అక్షయ తృతీయ రోజు కనుక బంగారం కొంటే, మంచిదని, అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు. ఈరోజు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. అక్షయ తృతీయ పర్వదినం కోసం వ్యాపారులు ప్రత్యేక నగలు తయారుచేస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి రూపాన్ని చిత్రించిన నాణాలు, రత్నాలు పొదిగిన నగలు ఈరోజు విశేషంగా కొంటారు.

అక్షయ తృతీయ నాడు కులం, వర్గంతో సంబంధం లేకుండా హిందువులు, జైనులు లక్ష్మీపూజ చేస్తారు. హిందువులు, జైనులు విశేషంగా జరుపుకునే అక్షయ తృతీయను 'అఖ తీజ్' అని కూడా అంటారు. గురువులకు దక్షిణ ఇస్తారు. పేదలకు దానధర్మాలు చేస్తారు. వైశాఖమాసం, శుక్లపక్షం మూడవ రోజు అక్షయ తృతీయ. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సరే, పట్టించుకోకుండా కొంటారు. వ్యాపారులు లక్ష్మీపూజను మరింత ఘనంగా చేస్తారు. కొత్త పద్దు పుస్తకాలు తెరుస్తారు. సిరిసంపదలు తెచ్చిపెట్టే లక్ష్మీదేవిని పూజిస్తారు. సంవత్సరం పొడుగునా ధనధాన్యాలు పుష్కలంగా రావాలని కోరుకుంటారు.

మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి,నాలుగు దిక్కులకు నాలుగు నాణాలను విసిరేస్తారు. ఇలా చేయడం వల్ల సంపదలు రావడానికి ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. ఈ ప్రత్యేక దినాన కొందరు గజ పూజ చేస్తారు. అలాగే అవకాశం ఉన్నవారు లక్ష్మీ కుబేర హోమం నిర్వహిస్తారు. కుబేరుడు దేవుళ్ళ కోశాధికారి కదా. మహా ధనవంతుడు అయిన కుబేరుడు కూడా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజిస్తాడు.

పురాణాల్లో అక్షయ తృతీయ గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడు. వ్యాసుడు చెబుతుంటే, వినాయకుడు రాశాడు. విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే.

త్రేతాయుగం అక్షయ తృతీయ నాడే ప్రారంభం అయింది. అక్షయ తృతీయ నాడు చాలామంది విష్ణుమూర్తిని ప్రార్ధించి, ఉపవాసం ఉంటారు. దానధర్మాలు చేస్తారు. బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరగాయలు, పసుపు, పండ్లు, బట్టలు, వస్తువులు - ఇలా ఎవరికి తోచినవి వారు దానం చేస్తారు.

అయోధ్య రాజు తీర్ధంకర రిషభదేవ సర్వ సంపదలూ త్యజించి, జైన సన్యాసిగా జీవించదలచాడు. జైన స్వాములు సర్వసంగపరిత్యాగులు. ఆఖరికి తమ ఆహారాన్ని కూడా తాము వండుకోరు. ఆకలేసినా, దాహమేసినా యాచనకు వెళ్తారు. ఒకరోజు రిషభదేవునికి ఆకలి వేసి యాచనకు వెళ్లాడు. అయితే తమ రాజు అడుగుతున్నది ఆహారం అని ఎవ్వరికీ అర్ధం కాలేదు. మహారాజు తమను అభ్యర్ధిస్తున్నాడు అంటే ధనమే అనుకున్నారు. ఇక అయోధ్య ప్రజలు రాజుగారికి బంగారం, నగలు, వజ్రవైఢూర్యాలు, ఏనుగులు, గుర్రాలు, ఖరీదైన దుస్తులు లాంటివెన్నో ఇచ్చారు. ఒక్క ఆహారం తప్ప అన్నీ ఇచ్చారు. పాపం, రిషభదేవుడు! ఇక ఆయన, కడుపు కాలిపోతోంది అని చెప్పలేక, ఆకలితో అలమటిస్తూ అలా ఉండిపోయాడు. ఒక సంవత్సరం అలాగే ఉండిపోయాడు. చివరికి ఆయన మనవడు శ్రేయాంశ కుమారుడు తాతగారి ఆకలిని గ్రహించి చెరుకురసం ఇచ్చాడు. సరిగ్గా ఆరోజు అక్షయ తృతీయ. అప్పటినుంచి జైనులకు అక్షయ తృతీయ పవిత్రదినం అయింది. ఉపవాసం ఉంటారు. పరస్పరం కానుకలు ఇచ్చుకుంటారు.

పూరీ రధయాత్రకు అవసరమైన రధాలను తయారుచేయడం కోసం ఒరిస్సా రైతులు అక్షయ తృతీయ నాడు మట్టిని తవ్వుతారు. చాలామంది అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండి, వసుదేవుని ప్రార్థిస్తారు. ఈ పవిత్ర దినాన గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఎదైనా వ్యాపారం ప్రారంభించడానికి అక్షయ తృతీయ చాలా మంచిది.

అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి భక్తిగా నమస్కరించుకుంటే ఏడాది పొడుగునా సిరిసంపదలతో తులతూగుతామని, తిరిగి రావనుకున్న అప్పులు ఏమైనా ఉంటే వసూలు అవుతాయని, మనం తీర్చాల్సిన బాకీలు ఉంటే ఇబ్బంది లేకుండా తీర్చగల్గుతామని పెద్దలు చెప్తారు.


akshaya tritiya, akshaya tritiya 2012, akshaya tritiya 2012 date, what is akshaya tritiya, hindu akshaya tritiya, Akshaya Tritiya Gold, akshaya tritiya date