Read more!

అక్షయ తృతీయ

 

 

 

అక్షయ తృతీయ  

 

ఒక దేశం యొక్క సంపదను "బంగారం''తోనే అంచనా వేస్తా,. ఒక అమ్మాయి అందాన్ని "బంగారుబోమ్మే''లాగ వుంది అని పోల్చుతాం.
మా అబ్బాయికేవండీ "బంగారం'' అని గొప్పగా చెప్పుకుంటాం.
మా అల్లుడిది అమెరికాలో "బంగారం'' లాంటి ఉదోగం అని దర్పంగా చాతుకుంటాం.
కొత్త పెళ్ళికూతురు "మా ఆయన బంగారం'' అనుకుని మురిసిపోతుంది.
ఆదినారాయణుని అలంకరణలో "బంగారం''దే ప్రథమస్థానం.
అందాన్ని సింగారించాలంటే "బంగారం'' తప్పనిసరి.
అందుకే ఆడవారికి "బంగారం'' అంటే అంత ఇష్టం.
ఎందుకు "బంగారానికి'' ఇంట ప్రత్యేకత, ప్రాధాన్యత? అంటే, కారణం ఉంది.

బంగారం జన్మదినం
 

 

సూర్యగోలంలో ఉండే ప్రధాన లోహం "బంగారం'' దీనికి ఆధారం మన పురాణాలే. ఆ "బంగారం'' ఈ భూలోకమో తొలిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి "వైశాఖ శుద్ధ తదియ'' నాడు ఉద్భవించింది. సాలగ్రామాల గర్భం నుంచి నిరంతరం అక్షయంగా బంగారం ఉద్భావిస్తూనే ఉంటుందని గండకీ నది చరిత్ర, సాలగ్రామాల చరిత్ర పరిశీలిస్స్తే అర్థమౌతుంది. అందుకే, "వైశాఖ శుద్ధ తదియ''ను "బంగారులోహ'' జన్మదినంగా భావించి "అక్షయ తృతీయ''గా పండుగ చేసుకోవడం మన సాంప్రదాయమైంది. "బంగారం'' ఒక లోహమే కదా! దానికి  జన్మదినం పండుగేమిటి? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. దీనికి సమాధానం ఉంది.
"బంగారం'' సాధారణ లోహం కాదు. దేవలోహం.
"బంగారానికి'' "హిరణ్మయ'' అని మరో పేరుంది.
"హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః'' అని విష్ణుసహస్రనామం చెప్తుంది.
"విష్ణువు'' హిరణ్యగర్భుడు. "గర్భమునందు బంగారం కలవాడు'' అని అర్థం.
విష్ణువుకు ప్రతిరూపమే "సాలగ్రామం''
సాలగ్రామ గర్భం నుంచి పుట్టినదే "బంగారం''
"బంగారం' 'విష్ణువుకు ప్రతిరూపం. అందుకే "బంగారం'' పూజనీయమైంది.
దాని జన్మదినమే మనందరకు "అక్షయతృతీయ'' పండుగదినమైంది
.
 


చందనోత్సవం :

 

 సింహాచలాదీశుడైన "శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి'' ఈ "అక్షయతృతీయ'' నాడు తప్ప మిగిలిన సంవత్సరమంతా చందనాచ్చాదిత రూపంలోనే మ్,మనకు దర్శనం ఇస్తాడు. వైశాఖ శుద్ధ తదియ [అక్షయతదియ]నాడు చందనాన్ని ఒలిచి స్వామికి మరల అలంకరిస్తారు. దానినే ఒలుపు ఉత్సవం అంటారు. ఈ అక్షయతదియ నాడు మాత్రమే స్వామి నిజరూపదర్శనం భక్తులకు లభిస్తుంది. దీనికి కరణం ఉంది.
ఒకసారి పురూరచక్రవర్తి తన ప్రియురాలైన ఊర్వశితో కలిసి పుష్పకవిమానం మీద విహరిస్తూ సింహాచల సమీపానికి రాగానే పుష్పకం ఆగిపోయింది. కారణం తెలుసుకోవాలని వురూరుడు పుష్పకం దిగి అన్వేషిస్తూంటే ... లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కనిపించింది. స్వామి సంకల్పాన్ని అర్థం చేసుకున్న వురూరుడు స్వామిని వేదోక్తవిధ్యుక్తంగా ప్రతిష్ఠ జరిపించాడు. కానీ,స్వామివారి నేత్రజ్వాలలకు భక్తులకు చందనపూత జరిపించాడు వురూరుడు ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారు వురూరవ చక్రవర్తికి కనిపించిన రోజు వైశాఖ శుద్ధ తదియ. అనగా అక్షయతృతీయ. అందుకే ఈ అక్షయతదియ నాడు చందనోత్సవం చేసి భక్తులకు స్వామివారి నిజరూపదర్శనం చేసుకునే అవకాశం కలిగిస్తారు.

పరశురాముని జన్మదినం :

 

 దురహంకారపరులైన క్షత్రవకుల సర్వస్వాన్ని సంహరించడానికి శ్రీమాహావిష్ణువు ... రేణుక, జమదగ్ని దంపతులకు పరశురామునిగా జన్మించినదీ ఈ "అక్షయతదియ''నాడే. అందుకే ఈ రోజుకు ఇంతటి ప్రత్యేకత.
    "యః కరోతి త్రుతీయామాం కృష్ణం చందన భూషితం
      వైశాఖస్యసితే పక్షే సయాత్యచ్యుత మందిరమ్''

శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ శుక్ల తృతీయ యందు శ్రీకృష్ణునికి చందనామ లేపనం చేసిన భక్తులకు విష్ణుసాలోక్యం కలుగుతుందని ధర్మసింధువు చెప్తుంది.
ఈ అక్షయ తదియనాడు జప, హోమ, తర్పణాలతో పితృదేవతలను ఆరాధిస్తే ... వారికి అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. భీష్మ ఏకాదశినాడు ఎలాగైతే తర్పణాలు ఇస్తామో ... ఈ అక్షయతదియనాడు పరశురామునికి అర్ఘ్యప్రధానం చేయాలి.
    "జామదగ్న్య మహావీర క్షత్రియాంతకర ప్రభో
      గృహాణార్ఘ్యం మయాదత్తం కృపయా పరమేశ్వర''

క్షత్రియులను అంతము చేసిన మహావీరుడవైన పరశురామా! పరమేశ్వరా! నేనిస్తున్న అర్ఘ్యమును దయతో స్వీకరించు'' అని భక్తిగా జలాంజలు సమర్పించాలి.

చివరిగా ఒక మాట కొనడమా? దానమా?!
 

 అక్షయ తదియనాడు కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని, అలా కొన్నవారి యింట బంగారం అక్షయంగా వృద్ధి పొందుతుందని మనందరి విశ్వాసం. అది నిజమే. కానీ,దానిని అర్థం చేసుకోవడం లోనే చిన్న లోపం.
అక్షయ తదియనాడు తప్పకుండా శక్త్యానుసారం బంగారం కొనాలి. అది కూడా లక్ష్మీరూపం ఉన్న నాణేన్ని కొనాలి. ఆ లక్ష్మీరూపుని శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంచి షోడశోపచార విథులతో, చందనాను లేపనాదులతో అర్చించి, ఆ బంగారు లక్ష్మీరూపును ఒక సద్భ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. ఆ దానం వల్ల దాత గృహంలో సువర్ణం అక్షయమవుతుంది. ఇందుకు మనందరకూ ఆదిశంకరుల బాల్య సంఘటన ప్రత్యక్ష నిదర్శనం.
బాల శంకరులకు ఓ పేద బ్రాహ్మణి ఓ ఎండు ఉసిరికాయను భిక్షగా వేసి, బంగారు ఉసిరికాయను ప్రతిఫలంగా పొందలేదూ!
ఒక విత్తును నాటితే వందవరికంకులు రావడం లేదూ!
మనం ఏ విత్తనం నాటుతామో అలాంటి ప్రతిఫలాన్నే పొందుతాం.
మనం ఏ దానం చేస్తామో .... అదే ప్రతిఫలాన్ని అక్షయంగా అందుకుంటాం
కనీసం ఈ అక్షయ తదియనాడైనా శక్త్యానుసారం సువర్ణాన్ని కొందాం. సువర్ణదానం చేద్దాం. అక్షయ సంపదలు అందుకుందాం. ఇదే "అక్షయతదియ' 'వెనుకనున్న అంతరార్థం, పరమార్థం.

 

రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం