Read more!

తిరుమల బ్రహ్మోత్సవాలు మొదటి రోజు .. వైభవ వేంకటేశుడు – థామస్‌ మన్రో!

 



  తిరుమల బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ..  వైభవ వేంకటేశుడు – థామస్‌ మన్రో!

 

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా మొదలవుతున్నాయి. మొదటి రోజున స్వామివారి వాహనమైన గురుడుని రూపం ఉన్న `గరుడ ధ్వజపటాన్ని` ధ్వజస్తంభం మీద ఎగురవేస్తారు. అదే ధ్వజారోహణం. అలా ధ్వజస్తంభం మీదకి వినయంగా చేరిన గరుడుడు ముల్లోకాలలో ఉన్న దేవతలను, బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తాడన్నమాట. మొదటి రోజున ధ్వజారోహణం అనంతరం స్వామివారిని నాలుగు మాడ వీధుల్లోనూ కన్నులపండుగగా ఊరేగిస్తారు. లోకాలను భరించే విష్ణుమూర్తి, తన భారాన్ని నిలిపేది ఆ ఆదిశేషుని మీదే కదా! అందుకే శేషవాహనానికి బ్రహ్మోత్సవాలలో అగ్రతాంబూలం! తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భరంగా ఆ దేవదేవుని వైభవాన్ని చవిచూసేందుకు, ఇక నుంచి తొమ్మిది రోజుల పాటు కొన్ని సందర్భాలను స్మరించుకుందాం.
 

థామస్‌ మన్రో:
ఆంగ్లేయులు కాలంలో మన దేశాన్ని ఎందరో అధికారులు పాలించారు. వారిలో చాలామంది తమ నిరంకుశత్వానికీ, అరాచకత్వానికీ పేరుపొందితే, కొద్దిమంది మాత్రం అధికారం కల్పించిన మదాన్ని కాదని తమదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొన్నారు. అలాంటివారిలో మన్రో ఒకరు. సర్‌ థామస్‌ మన్రో 1761లో స్కాట్లండులో పుట్టాడు. 1780కి మద్రాసు చేరుకుని బ్రిటిష్‌ సైన్యంలో చేరాడు. సైన్యంలో భాగంగా మన్రో ఎన్నో యుద్ధాలలో తన పోరాటపటిమను చూపాడు. అతని చదువు, పట్టుదలను గమనించిన ఉన్నతాధికారులు 1800 నాటికి ఆయనను కడప, అనంతపురం, కర్నూలు, బళ్లారి ప్రాంతాలకు కలెక్టరుగా నియమించారు.

 


ఒక పక్క తరచూ ముట్టడించే కరవు, మరో పక్క ఊళ్లమీద పడి నిర్దాక్షిణ్యంగా దోచుకునే పిండారీలునే దొంగలు, ఇంకోపక్క అస్తవ్యస్తంగా ఉన్న స్థానిక పాలన. వీటి మధ్య రాయలసీమలోకి ప్రవేశించాడు మన్రో. అరాచకశక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. రైతులకి భారమైన శిస్తులను అంతకంతకూ తగ్గించాడు. చెరువులను బాగుచేయించి నీటి లభ్యతను పెంచాడు. స్వయంగా పేదరికాన్ని చవిచూసినవాడు కావడంతో, సాధారణ ప్రజల కష్టాలను తనదిగా భావించగలిగేవాడు మన్రో. కాలి నడకన గ్రామాలను సందర్శిస్తూ రైతుల ఇబ్బందులను గమనించేవాడు. ఇప్పటికీ రాయలసీమలో మన్రో చల్లటి పాలనను గుర్తుచేసుకుంటారు అక్కడి ప్రజలు. తరువాత కాలంలో మద్రాసు గవర్నరుగా సేవలందించిన మన్రో అక్కడ కూడా తనదైన ముద్రను వేసుకున్నాడు.

మద్రాసు గవర్నరుగా ఉన్న కాలంలో మన్రో భరించలేని కడుపునొప్పితో బాధపడేవాడట. ఎన్ని మందులు వాడినా, ఎంతటి ఉపచారాలు చేసినా ఆ నొప్పి ఆయనను వీడలేదు. చివరికి ఎవరో వేంకటేశ్వరుని దర్శించుకుంటే ఆ రోగం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయనకు చెప్పారు. దాంతో వేంకటేశ్వరునికి దర్శించుకునేందుకు బయల్దేరారు విలియమ్స్‌. తాను హైందవేతరుడు కావడంతో కొండని ఎక్కేందుకు సందేహించి తిరుపతిలోనే ఉండిపోయాడని ఒక కథనం. ఆ రాత్రివేళ స్వయంగా దేవుడే, మానవ రూపంలో ఆయనకు కనిపించి కొండని ఎక్కాల్సిన పని లేదని చెప్పాడట. మద్రాసుకి తిరిగి చేరుకున్న తరువాత, మన్రో వ్యాథి నయం కాసాగింది. ఇదంతా ఆ వేంకటేశ్వరుని దయే అని భావించిన మన్రో రోజూ ఆయనకు నైవేద్యాన్ని అందించేందుకు పెద్ద గంగాళాన్నీ, అందులో స్వామివారికి నైవేద్యం వండేందకు శాశ్వత నిథినీ ఏర్పాటు చేశాడు. మన్రో గంగాళం పేరుతో ఇప్పటికీ అది తిరుమలలోనే ఉంది. రోజూ అందులో నైవేద్యాన్ని వండి స్వామివారికి తప్పక నివేదిస్తారు.

 


మన్రోకి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా చెప్పుకొంటారు. కడప జిల్లాలోని ఆంజనేయస్వామి ఆలయం ఉన్న `గండిక్షేత్రం` అనే గుడిని ఓసారి దర్శించారట. ఆ సమయంలో ఆయనకి రెండు కొండల నడుమ ఒక అందమైన తోరణం కనిపించిందట. `ఆ కొండల నడుమ అంత అందమైన తోరణం ఏమిటి?` అని తన సైనికులను అడిగారట మన్రో. ఆ సైనికులలో వృద్ధులైనవారొకరు `అయ్యా! ఆ తోరణం ఎంతో పుణ్యాత్ములకి కానీ కనిపించదు. అయితే అలా కనిపించినవారు ఆరునెలలు మించి బతకరు` అని చెప్పారట. సైనికుడు చెప్పినట్లుగానే మన్రో ఆరునెలలు తిరుగకముందే కలరా సోకి 1827లో తెలుగునేల మీదే చనిపోయారు.

- నిర్జర.