Read more!

శ్రీ సాయిసచ్చిరితము

 

శ్రీ సాయిసచ్చిరితము 
నలుబది ఆరవ అధ్యాయము
 
 
 


శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలు     బాబ ఫోటో రూపమున నతనికంటె ముందే వెళ్ళుట
 
సాయి పాదాలను నమ్మిన మది పావనం అగును. ఆయన దర్శన భాగ్యం చేత పాపాములు తొలుగును.కంటికి కనపడని తీగతో నీ భక్తులను కట్టి వుంచి, వారిని సర్వవేళల కాచు దయగల తండ్రివి. బాధలతో, భయాలతో వచ్చు వారిని తల్లి వలె కాచే శరణాగతివి. బాబా పాదములకు మనస్సుని అర్పించి ఆయన నామమునే జపించిన, భక్తుల కోరికలు నెరవేరును. కోరికలు లేని వారికి ఆయన బ్రహ్మానందమును ఇచ్చును. ఈ సాధనలో పాపములు, రజ,తమో గుణములు నశించును. సాత్వికత, ధార్మికత అలవడును. జ్ఞానము లభించును. కర్మబంధముల నుండి తప్పించు దివ్య మార్గము  నీ దర్శనము.నీ యందు నమ్మిక ఉంచిన భక్తులు నేటికి నీ లీలను చూపు అజరామరుడవు. ఇప్పుడు నీ వెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు వారికై సర్వవ్యాప్తమై వున్నావని ఎన్నో సార్లు నీ లీల ద్వారా తెలియజేసావు. బాబా ఏ భక్తునినైనా ఆమోదించిన ఆ భక్తుని రాత్రింబవళ్లు కాచెడి వాడు. అలా ఆ భక్తుడు ఆయన చెంత లేకపోయినా ఎక్కడికి పోయినా  అక్కడకు భక్తుని కంటే ముందే బాబా చేరుకొని ఊహించని రూపమున దర్శనమిచ్చును. అలాంటి ఉదాహరణలు ఏన్నో కలవు. ఇది అందులో ఒకటి. 


ఇక ఈనాటి అధ్యాయంలోకి 

కాకాసాహెబ్ తన కుమారిడి ఉపనయనం నాగపూరులో చేయలని నిశ్చయించుకుంటాడు. బాబాని ఆ వేడుకకి రమ్మని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుడి వివాహం గ్వాలియర్‌లో చేయాలని నిశ్చయించుకుని బాబాను రమ్మని ప్రేమ పూర్వకుంగా పిలుస్తాడు. వారిద్దరూ బాబాను స్వయంగా రమ్మని బలవంత పెడుతారు. కానీ బాబా శ్యామాను వెళ్లమని పురమాయిస్తారు. ఆ యాత్రకు బయలుదేరిన శ్యామా కాశీ, ప్రయాగ యాత్రలు  కూడా చేయాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన అప్పాకోతే ఆయనతో కూడా ప్రయాణానికి సిద్ధం అవుతాడు. బయలు దేరే ముందు బాబా వారితో "కాశీ ప్రయాగ యాత్రలు ముగిసే సరికి శ్యామ కంటే ముందే నేను గయాలో ఉంటా" అని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకోండి.

 

బాబా దగ్గర సెలవు తీసుకుని శ్యామా, అప్పాకోతే నాగపూర్, గ్వాలియరులో వేడుకలు జరుపుటకు బయలుదేరుతారు. వారు మొదట నాగపూరు చేరుకొని, అక్కడ ఉపనయన కార్యక్రమాలకు హాజరు అవుతారు. అక్కడ కాకాసాహెబు దీక్షిత్ వారికి కొంత సొమ్ము కానుకగా యిచ్చి చక్కటి సత్కారములు చేసి పంపెను. అక్కడి నుంచి వారు నానాసాహెబు ఇంటికి, గ్వాలియరు ప్రయాణమై వెళ్తారు. అక్కడ ఆయన కుమారుడి వివాహమహోత్సవం తిలకిస్తారు. నానాసాహెబు, ఆయన బంధువు జఠార్ కొంత సొమ్ము కానుకలుగా వారికి ఇస్తారు. అలాగే జఠారు అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో శ్వామాకు గొప్ప సత్కారం జరుగుతుంది. అక్కడి నుంచి వారు అయోధ్యకు వెళ్ళి మూడు వారాలు వుంటారు. ఆ తర్వాత కాశీకి పయనమవుతారు.


 కాశీలో రెండు నెలలు గడిపి అక్కడి నుంచి గయకు బయలుదేరుతారు. గయలో ప్లేగు వ్యాధి ప్రబలి వుందని శ్యామాకి రైలులో తెలుస్తుంది. గయ స్టేషనులో దిగి ఆ రాత్రి ధర్మశాలలో సేదతీరుతారు. ఉదయమే వారిని పండా వచ్చి వారిని కలుస్తాడు. తొందరగా బయలుదేరమని కోరుతాడు. అప్పుడు శ్వమా అక్కడ ప్లేగు వ్యాధి కలదా అని ప్రశ్నిస్తాడు. దానికి పండా వ్యాధి లేదని, స్వయంగా వచ్చి చూడమని చెప్తాడు. వారిని పండా తన ఇంటికి తీసుకు వెళ్తాడు. పండా ఇల్లు చాలా పెద్దది. చక్కటి వసతి ఏర్పాట్లు చేశాడు. అది చూసిన శ్యామా చాలా సంతోషించెను. అన్నిటి కంటే ముందు ఆ ఇంటి ప్రవేశము చేసినంతనే అమర్చిన సాయిబాబా పెద్ద పటము చూసి శ్యామా చాలా తృప్తి చెందెను. అది చూసి మైమరిచి పోతున్న శ్యామా కు సాయిబాబా మాటలు జ్ఞప్తికి వచ్చెను. "కాశీ ప్రయాగ యాత్రలు ముగిసే సరికి శ్యామ కంటే ముందే నేను గయాలో ఉంటా" అని చెప్పిన బాబా పలుకలు మదిన వినిపించసాగాయి. దాంతో కంట్లో కన్నీరు కమ్మి, శరీరము గగుర్పాటుకు గురై, గొంతు పెగలక, అతను వెక్కి వెక్కి ఏడ్చుట మొదలుపెట్టెను. అది చూసిన పండా ప్లేగు వ్యాధికి భయపడి ఏడుస్తున్నాడనుకొనెను. శ్వామాని సమీపించిన పండాతో, "ఈ పటం ఎక్కడి నుంచి తీసుకు వచ్చావ"ని అడిగెను. దానికి పండా "మా ప్రతినిధులు 2, 3 వందల మంది మన్మాడు, పుణాతాంబేలలో వున్నారు. వారు గయకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూస్తుంటారు. వారి వల్ల బాబా గురించి విని పన్నెండేళ్ల క్రితం బాబ దర్శనం చేసుకున్నాను. అప్పుడు శ్యామా ఇంటిలో ఉన్న ఈ బాబా పటం చూసి ఇమ్మని అడిగాను. అప్పుడు బాబా అనుజ్ఞతో శ్యామా నాకు ఈ పటం ఇచ్చారు " అని బదులు చెప్పాడు. 


అప్పుడూ శ్యామాకు జరిగినదంతా గుర్తుకు వచ్చి ఆ పటం ఇచ్చిన శ్యామా తానే అని పండాకి పరిచయం చేసుకుంటాడు. అలా వారు పూర్వ జ్ఞాపకాలతో ఒకరికొకరు మరింత ప్రీతిపాత్రులవుతారు. ధనవంతుడైన పండా శ్యామాకు రాజలాంఛనాలతో స్వాగతం పలుకుతాడు. శ్యామాను ఏనుగుపై ఊరేగిస్తాడు. ఎంతో ఆదరంగా అతిథి మర్యాదలు చేస్తాడు. 

ఈ ఇతివృత్తాన్ని బట్టి సాయిబాబా మాటలు అక్షర సత్యాలు అని అర్థమవుతుంది. ఆయనకు తన భక్తుల పట్ల అమితమైన ప్రేమ. వారు ఎక్కడికి వెళ్లినా ఆయన కృపకు చేరువలోనే వుంటారు.