అభినవ రాక్షసుడు
posted on Jul 24, 2013
అభినవ రాక్షసుడు
శ్రీమతి శారద అశోకవర్ధన్
పారపళ్ళు లేవు కోర మీసాల్లేవు
వీరుడసలే కాదు పరమ భీరువు
నోరువిప్పి మాట్లాడలేడు
తీరుగా ఏపనీ చెయ్యలేడు
చెప్పేది ఒకటయితే చేసేది వేరొకటి
చెప్పి చేసేది ఇంకొకటి .
కటువుగా మాట్లాడడు కఠిణంగా అగుపడడు
సుతిమెత్తని తీగెలా మెలికలు తిరిగిపోతాడు
పాదరసంలా దేనికీ అంటక నడిచిపోతాడు
బండరాయికన్నా బలమైన గుండె కలవాడు
బల్లకింద నుంచే బహుకార్యాలు సాధించగలవాడు
కత్తితో అవసరం లేనివాడు కలంతోనే పొడిచి చంపగలిగేవాడు
గాయం కనబడకుండా గట్టి జాగ్రత్తలు తీసుకునేవాడు
ఖాయంగా నానాగడ్డీ కరిచైనా తన స్థానాన్ని నిలుపుకునేవాడు
కక్షబూనితే కాళ్ళబూట్లనే రధచక్రాలుగా వాడికసి తీర్చుకునేవాడు
కిక్కురు మనకుండా నిలుచున్నచోటే నీతులు చెబుతూనే
గోతులు తీసేవాడు
ఎవడయ్యావాడు ఎవడు వాడు?
వాడె ఆధునిక రాక్షసుడు
నేటి మానవుడు.
వాడిని పసిగట్టడం కష్టం వాడి నీడంటేనే భయం
అంతకన్నా
పారపళ్ళూ కోరమీసాలూ వున్న ఆకాలపు
రాక్షసుడే నయం! ఇది ముమ్మాటికీ నిజం!