వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్...ఏఐ, ప్రకృతి సాగుపై ఆసక్తి
Publish Date:Feb 16, 2026
Advertisement
అమరావతి ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రం గురువారం ప్రత్యేక సందడితో కళకళలాడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అక్కడి వ్యవసాయ విధానాలను స్వయంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, ఆధునిక సాంకేతికతతో సాగు ఎలా మారుతోందో తెలుసుకోవడంపై ఆయన ప్రత్యేక ఆసక్తిచూపించారు. ఈ సందర్భంగా రైతులతో జరిగిన చర్చలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ఖర్చులు తగ్గింపు, సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ స్థాయికి చేరుకునే మార్గాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మహిళా రైతులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకగా, స్థానికంగా తయారు చేసిన వంటకాలను బిల్ గేట్స్ రుచి చూశారు. స్థానిక ఆహారంపై ఆయన ఆసక్తి చూపడం అక్కడి రైతులను ఆనందపరిచింది. రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఈ సందర్శన మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి సాగు, డిజిటల్ వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలు భవిష్యత్ వ్యవసాయానికి కీలకమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా వెల్లడించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సందర్శన సందర్భంగా ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించిన బిల్ గేట్స్, రాష్ట్రంలో రైతులు అవలంభిస్తున్న వినూత్న పద్ధతులపై ప్రశంసలు వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, పంటల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికత పాత్ర గురించి అధికారులు సమగ్రంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడల నివారణ, పంట ఆరోగ్యాన్ని పరిశీలించే విధానాలను గేట్స్ స్వయంగా పొలంలోకి వెళ్లి తిలకించారు.
http://www.teluguone.com/news/content/undavalli-agricultural-field-36-214173.html





