అవినాష్ పాపం చిన్న పిల్లోడంట!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.  తాజాగా జగన్  వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకడైన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అంటూ సంబోధించి మరోసారి నెటిజనులకు అడ్డంగా దొరికి పోయారు. గురువారం (ఏప్రిల్ 24) పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సభలో ఆయన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అని పేర్కొన్నారు. ఈ చిన్నపిల్లోడి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఆయన బెయిలు రద్దు పిటిషన్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో కడప లోక్ సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని  చిన్నపిల్లోడిగా అభివర్ణిస్తూ జగన్ ఆ ఆరోపణలను తుడిచేసే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదు కనుకనే ఆయనకు కడప లోక్ సభ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు.  అయినా అవినాష్ రెడ్డి అమాయకత్వం గురించి జగన్ కు స్వయానా మేనమావ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గతంలోనే బాహాటంగా చెప్పేశారు. వివేకా మృతదేహానికి కుట్టు వేస్తుంటే అవినాష్ రెడ్డి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోయారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అదికూడా కమలాపురంలో ఓ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకునే ఆ మాట చెప్పారు.  ఇప్పుడు జగన్ కూడా అదే చెబుతున్నారు. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అతడికి ఏమీ తెలియదు అంటున్నారు.  వివేకా హత్య కేసులో అవినాష్  నిందితుడని అనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ తేల్చి చెప్పింది. కోర్టులూ అదే చెబుతున్నాయి. అయినా జగన్ అవినాష్ రెడ్డిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి.  
Publish Date: Apr 25, 2024 4:23PM

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం మూడుగంటలతో ముగిసింది.  ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4, 210 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక తెలంగాణలోని 17లోక్ సభ స్థానాలకు గాను 603 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది.  అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లను రేపు పురిశీలిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది.  మే 13న పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.
Publish Date: Apr 25, 2024 4:10PM

జగన్ కు సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ? వైసీపీ మైండ్ బ్లాక్

గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది. హత్య కేసు నిందితులకు వత్తాసు పలుకుతున్న జగన్ పై సొంత కుటుంబీకులే విమర్శలు గుప్పిస్తుండటం, కేసు దర్యాప్తు, విచారణలో వేళ్లన్నీ వైసీపీ కడప లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి అవినాష్ రెడ్డివైపే చూపుతుండటం, ఆ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతుండటం ఎన్నికల సమయంలో   వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు నుంచి గ్యాగ్ అర్డర్ తెచ్చుకున్నారు. అయితే కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు బుధవారం విచారణకు రావాల్సి ఉండగా ఆ బెంచ్ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది. కొత్త బెంచ్  ముందుకు ఆ కేసు విచారణకు రానుంది.   అయితే  వివేకా హత్య పై మాట్లాడకూడదంటూ కడప కోర్టు పేర్కొన్న జాబితాలో లేని సౌభాగ్యమ్మ సరిగ్గా జగన్ పులివెందులలో నామినేషన్ వేసే సమయానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసులో నిందితులకు మద్దతుగా నిలబడుతున్నావంటే సూటిగా పేర్కొని వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. వాస్తవానికి ఈ సారి ఎన్నికలలో జగన్ కు తెలుగుదేశం కూటమి మాత్రమే కాదు సొంత కుటుంబం కూడా ప్రతిపక్షంగా మారింది. వివేకా హత్యకేసులో న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లనే పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ వారు తెలుగుదేశం స్క్రిప్టు చదువుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శల గుప్పిస్తోంది. అక్కడితో ఆగకుండా షర్మిల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ సోషల్ మీడియాలో పేర్కొన్న అంశాలనే ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ  జగన్ కు ఓ బహిరంగ లేఖ ద్వారా షాక్ ఇచ్చారు. ఆ లేఖ కూడా జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే విడుదల చేశారు. ఆ లేఖలో   నీ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో వివేకా హత్య జరిగిన నాటి నుండి నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యింది. ఇటువంటి సందర్భంలో అన్నగా చెల్లికి అండగా నిలవాల్సిన నువ్వు ఇలా వివేకా హత్యకు కారణమైన వారికి రక్షణగా నిలవడం  తగునా జగన్..? అంటూ సూటిగా ప్రశ్నించారు.  సునీత కు అండగా నిలబడిన నీ సొంత చెల్లి షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నువ్వు నోరెత్తకపోవడమేంటంటూ నిలదీశారు. సరిగ్గా జగన్ నామినేషన్ దాఖలు చేసే రోజునే జగన్  కు ఆమె  పిన్నమ్మ బహిరంగ లేఖ రాయడం వైసీపీని దిగ్భ్రమకు గురి చేసింది. ఆమె సూటిగా, సుత్తి లేకుండా చెల్లెళ్ల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఆ లేఖలో ఎండగట్టడంతో ఆ లేఖపై ఎలా స్పందించాలో తెలియక జగన్ సహా వైసీపీ నేతలకు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అంతే కాకుండా జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, దర్యాప్తు సంస్థలు వేలెత్తి చూపుతున్న అవినాష్ రెడ్డికి రక్షణగా నిలుస్తున్న జగన్ ను తప్పుపట్టడంతో జగన్ డిఫెన్స్ లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సౌభాగ్యమ్మపై కూడా షర్మిల, సునీతమ్మల వలె ఎదురుదాడికి దిగుతుందా? ఆమెపై కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ముద్ర వేస్తుందా చూడాల్సి ఉంది. జగన్ అండ్ కో  మేరకు చంద్రబాబు స్క్రిప్ట్ చదివేవారి జాబితాలో ఇప్పుడు సౌభాగ్యమ్మను కూడా చేరుస్తారా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వివేకా హత్య కేసు జగన్ కు ఈ ఎన్నికల వేళ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదనడంలో సందేహం లేదు.  
Publish Date: Apr 25, 2024 3:19PM

బెజవాడ సెంట్రల్ బరిలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల

సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు. వారిలో కొందరు తమదైన ముద్ర వేశారు. మరి కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే ఇందులో జొన్నవిత్తుల ఏ కోవలోకి వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ సారి ఎన్నికలలో సినీ రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచిన సంగతి విదితమే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికలలో విజయం సాధించిన రోజా ఈ సారి ఎదురీదుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక విషయానికి వస్తే జొన్నవిత్తుల విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ అంటేనే రాజకీయాలకు క్యాపిటల్ వంటిది. అటువంటి విజయవాడ నుంచి జొన్నవిత్తుల ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి ఏ మేరకు ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.  వీరితో పోటీలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది కాలమే నిర్ణయిస్తుంది.  
Publish Date: Apr 25, 2024 2:30PM

EVM మళ్ళీ మళ్ళీ గెలిచింది, గెలుస్తుంది!

ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. ఓటింగు యంత్రాలను వ్యతిరేకించే వారి వాదన మన దేశ సాంకేతికతను అవమానించేలా ఉంటుంది. ప్రపంచంలో ఫలానా దేశాల్లో వాడటం లేదు, ఫలానా దేశాలు నిషేధించాయి కనుక ఓటింగు యంత్రాలు నమ్మదగినవి కావు అని వాదిస్తారు. బుర్ర తక్కువ లేదా భారత దేశం కనుగొన్న ఓటింగు యంత్రాలను మేము ఎందుకు వాడాలి అనే బలుపుతో ఆయాదేశాలు వాడటం లేదు అని కోణంలో ఆలోచించరు.  లక్షలాది ఓటింగు యంత్రాలు గల్లంతు అయ్యాయి అనే ఆరోపణ రాజకీయ పరమైంది. ఒకవేళ ఓటింగు యంత్రాలు దొంగిలించబడ్డా... వాటితో ఏమీ చేయలేరు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది దుమ్మెత్తి పోసినా,  ఓటింగు యంత్రాలుతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న భారత ఎన్నికల సంఘం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈవిఎంలపై దేశంలో పెద్ద ఎత్తున‌ చర్చ సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల కమిషన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని అంటోంది. సాంకేతిక సమస్యలపై ఈవిఎంలు మొరాయించే అవకాశం మాత్రమే ఉంది గానీ అక్రమాలకు పాల్పడే లేదా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అంటోంది.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు సుర‌క్షిత‌మైన‌వ‌నీ, ఇవి భారతదేశానికి గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చెబుతున్నారు.  EVM సింగిల్ చిప్ ప్రోగ్రామ్ మాత్రమేన‌నీ, ఫ్రీక్వెన్సీ లేదనీ.. కాబట్టి హ్యాకింగ్ ప్రశ్నే లేదని తెలిపారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. భార‌త దేశం ఎంతో వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను  అందించగలదో తెలుసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు.  ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్‌ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్‌ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్‌లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.  ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత, అవగాహన చాలా కీలకమని, అందువల్ల ఈవీఎంల క్రమబద్ధమైన నిల్వ, నిర్వహణ, తరలింపు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, చెక్‌లిస్ట్ అనుసరించడం చాలా కీలకమని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే చెబుతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 1:24PM

జగన్.. బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు సారూ!?

ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది. రాయిదాడి సంఘటనను హత్యా యత్నం అంటూ మీడియాలో వైసీపీ నేతల ప్రకటనలతో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆ దాడిని ఖండిస్తూ  ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్ కూడా దాడి ఘటనను ఖండిస్తూ ప్రకట చేశారు. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యకు కూడా డిమాండ్ చేశారు. సరే ఒకింత ఆలస్యమైనా సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా పరిగణననలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలిస్ పై బదలీ వేటు వేసింది. అక్కడకు ఆ అంకం ముగిసినట్లుగానే భావించాలి. కానీ జగన్ లో మాత్రం ఆ దాడి నుంచి ఇంకా సానుభూతి పిండుకోవచ్చన్న దింపులు కళ్లెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికీ ఆయన నుదుటి మీద కనుబొమలను కవర్ చేసేలా బ్యాండ్ ఎయిడ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రాయి తగిలిందని చెప్పి నుదురు పట్టుకున్న తరువాత జగన్ కు నుదుటిపై గుండ్రంగా ఒక చిన్న బ్యాండ్ ఎయిడ్ వేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పదుల సంఖ్యలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్న తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ సైజు ఒక్క సారిగా పెరిగిపోయింది. నుదుటి భాగాన్నే కాకుండా కనుబొమను కూడా వకర్ చేస్తూ పెద్ద బ్యాండ్ ఎయిడ్ ఇప్పుడు ఆయనకు సహజ కవచకుండలంగా మారిపోయి కనిపిస్తున్నది.  హత్యాయత్నం అని వైసీపీ ఎంతగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించినా జనం నమ్మలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే కాదు చివరాఖరికి సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పై జరిగింది గులకరాయి దాడే అని పదే పదే చెబుతున్నారు. సరే అది పక్కన పెడితే గాయం తగిలి ఇన్ని రోజులైనా వైద్యులు ఇంకా జగన్ నుదుటిపై ఉన్న బ్యాండ్ ఎయిడ్ ను ఎందుకు తీయలేదా అని వైసీపీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా సానుభూతి కోసమే ఇబ్బంది అయినా బ్యాండ్ ఎయిడ్ ను అలా భరిస్తూ కొనసాగిస్తున్నారా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే జగన్ స్టైల్ లో నుదుటిమీద బ్యాండ్ ఎయిడ్ పెట్టుకుంటూ యూత్ ఓ లెవల్ లో  ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసే దాకా జగన్ నుదుటిమీద ఆ బాండ్ ఎయిడ్ ను అలా ఓ ఆభరణంలా మెయిన్ టెయిన్ చేస్తారేమో అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు.  
Publish Date: Apr 25, 2024 1:02PM