పవన్ తొలి విడత   ఎన్నికల షెడ్యూల్ ఖరారు 

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి 'వారాహి విజయభేరి' అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.  కాగా, పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్ లను నియమించారు. వీరి నియామకానికి పవన్ ఆమోద ముద్ర వేశారు.  జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో కత్తులు దూస్తుండగా, ఇక పవన్, నారా లోకేశ్ ఎంట్రీ ఇవ్వడమే మిగిలుంది. చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు  పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు.  మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పిఠాపురానికి  పవన్ రానున్నారు. ఏప్రిల్ 3 - తెనాలి, ఏప్రిల్ 4 - నెల్లిమర్ల, ఏప్రిల్ 5 - అనకాపల్లి, ఏప్రిల్ 6 - యలమంచిలి, ఏప్రిల్ 7 - పెందుర్తి,ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్ ,ఏప్రిల్ 10-రాజోలు, ఏప్రిల్ 11 - పి.గన్నవరం, ఏప్రిల్ 12 - రాజానగరం లో పవన్ పర్యటించనున్నారు. 
Publish Date: Mar 29, 2024 4:56PM

సికిందరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం.. కాదు కాదు బొంతు!

లోక్ సభ  ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్  లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి వైదొలగడంతో అక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా బాబూమోహన్ ను నిలబెట్టాలని భావిస్తున్నది. బీఆర్ఎస్ కు రాజీనమా చేసి బీజేపీలోకి అక్కడ నుంచి కేఏపీల్ విశ్వశాంతి పార్టీలోకీ మారిన బాబూమోహన్ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ బామూమోహన్ ను నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. ఇక సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన దానం నాగేందర్ ను మార్చాలన్న యోచనలో ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్  గూటికి చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులు పిటిషన్ దాఖలైంది. అది అలా ఉంచితే కాంగ్రెస్ అధిష్ఠానం దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆయన రాజీనామా చేస్తేనే సికిందరాబాద్ ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పినా కూడా రాజీనామాకు దానం ససేమిరా అంటుండడంతో  కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉందనీ, సికిందరాబాద్ నియోజకవర్గంలో దానం కు బదులుగా మరో వ్యక్తిని నిలపాలని భావిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. తాజా సమాచారం మేరకు దానం నాగేందర్ ను సికిందరాబాద్ అభ్యర్థిగా తప్పించి ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నది.  
Publish Date: Mar 29, 2024 3:35PM

తాడికొండ రాజయ్య యూటర్న్.. బీఆర్ఎస్ కు చేసిన రాజీనామా ఉపసంహరణ

మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా  కడియం కావ్య పోటీకి దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తాడికొండ రాజయ్య రాజీనామా ఉపసంహరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు బీఆర్ఎస్ ను సీనియర్లందూ వీడిపోతున్న తరుణంలో పార్టీని వీడిన తాడికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం విశేషం. అయితే కడియం శ్రీహరితో విభేదాల కారణంగానే పార్టీని వీడినట్లు చెప్పిన రాజయ్య, ఇప్పుడు కడియం శ్రీహరే స్వయంగా బీఆర్ఎస్ ను వీడటంతో తాను పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కేసీఆర్ అనుమతిస్తే వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కడియం ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. రం.
Publish Date: Mar 29, 2024 3:16PM

పెండింగ్ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను  ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది.  ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది. ఆయనను ఆయన కోరుకున్న భీమిలి నియోజకర్గం నుంచే బరిలోకి దింపింది. ఆయనకు ఇద్దామని భావించిన చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా కళా వెంకటరావును ప్రకటించింది.  ఇక కదిరి స్థానంలో ఇప్పటికే  కందికుంట యశోద పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ఆమెకు బదులుగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు అవకాశం ఇచ్చింది.  ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది. విజయనగరం లోక్‌సభ స్థానానికి   కలిశెట్టి అప్పలనాయుడును అభ్యర్థిగా ప్రకటించింది.  అనంతపురం అర్బన్ స్థానాన్ని ఆశించిన  ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగులుస్తూ అక్కడ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.  చీపురుపల్లి - కళా వెంకట్రావు,  భీమిలి - గంటా శ్రీనివాసరావు, పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకటరమేశ్ నాయుడు,  దర్శి - గొట్టిపాటి లక్ష్మి,  రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం,  ఆలూరు - వీరభద్ర గౌడ్,  గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,  కదిరి - కందికుంట వెంకటప్రసాద్ ఇక  లోక్ సభ అభ్యర్థులుగా విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు,  ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ,  కడప నుంచి భూపేశ్ రెడ్డిలను ప్రకటించింది. 
Publish Date: Mar 29, 2024 2:55PM

సంక్షోభాలను అధిగమించి.. సమున్నతంగా నిలిచి..!

తెలుగుదేశం పార్టీ  ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది.  అంతే కాదు  జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.  జగన్ కక్ష పూరిత రాజకీయాల కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా 50 రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అందరూ ఇక తెలుగుదేశం పనై పోయిందన్న అనుకునే పరిస్థితులు ఆ ఐదేళ్ల కాలంలో ఏర్పడ్డాయి. అయితే  తెలుగుదేశం మాత్రం  అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రజల నమ్మకాన్ని గెలిచింది. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే తరువాయి అన్న స్థితికి చేరింది.  అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనడం, సంక్షోభాల నుంచి బయటపడటం ఆ పార్టీకి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.   అలా ఎదుర్కొన్న ప్రతి సారీ   వాటిని అధిగమించి నిలబడింది.  ప్రజామన్ననలు పొందింది.   బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమి తరువాత ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చూసిన తరువాత  తెలుగుదేశం విశిష్ఠత, పటిష్ఠతపై తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.   పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత వంద రోజులలోనే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందా అనిపించేలా దిగజారింది.  పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ సీనియర్ నేతలే బాహాటంగా చెబుతూ పక్క పార్టీలలోకి దూకేస్తున్న పరిస్థితి.  బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచే విషయంలోనూ, పార్టీ నేతలలో, క్యాడర్ లో నమ్మకం కలిగించడంలోనూ ఆ పార్ట అధినేత కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా, వారిపై తన ఏకపక్ష నిర్ణయాలను రుద్దిన కేసీఆర్కు  ఓటమి తరువాత పార్టీ నేతలెవరూ అండగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఎంపీ టికెట్‌ పొందిన అభ్యర్థి కూడా పార్టీని వీడటాన్ని మించిన నిదర్శనం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పదిహేనేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని విజయవంతంగా నడిపించగలిగారు.  ఈ క్రమంలో వైఎస్ఆర్, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిల నిరంకుశ పాలనను ఎదుర్కొన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలనడానికి ఉదాహరణగా చంద్రబాబు నిలిస్తే.. ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా కేసీఆర్ నిలుస్తారని పరిశీలకులు ఉదాహరణలతో సహా విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలతో ఉండి వారి విశ్వసనీయతను పొందిన నేత చంద్రబాబు అయితే... అధికారంలో ఉండగా జనం నీడ కూడా తనమీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని.. ఎన్నికల సమయంలో ప్రసంగాలకే పరిమితమైన నేత కేసీఆర్ అని చెబుతున్నారు.  
Publish Date: Mar 29, 2024 1:39PM

అప్పుడు ముందస్తుకు వెళ్లడమే ముంచేసిందా?

భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన  జరిగింది. ఆ తరువాత 2014లో తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి ఆరు నెలల ముందే అంటే 2018 డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి.  2018 ఎన్నికలలో విజయం సాధించి కేసీఆర్ వరుసగా రెండో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టారు. అప్పట్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లి మెరుగైన ఫలితాలు సాధించగలిగారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే కేసీఆర్ అప్పట్లో ముందస్తుకు వెళ్లడం వల్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక లతో పాటుగా కాకుండా ముందుగానే అంటే 2023 డిసెంబర్ లోనే జరిగాయి. 2018లో కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లడం కలిసి వచ్చింది. కానీ నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 2023 ఎన్నికలలో ప్రతిపక్షానికి పరిమితం కావలసి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు విపక్షాలను చిత్తు చేసిన వ్యూహంగా ప్రశంసలు గుప్పించిన వారే  నేడు నాటి నిర్ణయం వ్యూహాత్మక  తప్పిదంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికే పరిమితం అవ్వడమే కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కామారెడ్డి స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. ఈ పరాజయం పార్టీ స్థాయినీ, నైతిక స్థైర్యాన్నీ బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఓటమి తరువాత పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నది. పార్టీ నేతలూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ కూడా పార్టీని వీడుతున్నారు. గత పదేళ్లుగా ఎవరి సలహాలూ, సూచనలూ పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధినాయకత్వం పట్ల బాహాటంగానే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అధినేతకు సన్నిహితులుగా గుర్తింపు పొందిన కేకే, కడియం వంటి వారు కూడా కారు దిగేయడంతో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందనా రాకపోవడం చూస్తుంటే ఆ పార్టీ పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అవగతమైంది. ఈ పరిస్థితి రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో ఇంకా పార్టీలో ఉన్న నేతలలో కూడా అంతర్మథనం ప్రారంభమైందని చెబుతున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ వ్యూహాత్మకంగా దిద్దుకోలేని తప్పిదం చేశారని బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి తప్పిదానికి ఇప్పుడు పార్టీ ఫలితం అనుభవిస్తోందని అంటున్నారు. 
Publish Date: Mar 29, 2024 12:25PM