ENGLISH | TELUGU  

50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 110 సినిమాలు.. దర్శకేంద్రుడు సాధించిన విజయాలివే!

on May 23, 2025

(మే 23 దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా..)

చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విజన్‌ వేరు, ఆయన చేసే సినిమాల తీరు తెన్నులు వేరు. కథ, కథనాల దగ్గర నుంచి పాటల చిత్రీకరణ వరకు ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చూపించడం ఆయన మొదటి సినిమా నుంచీ అలవరుచుకున్నారు. 1975లో బాబు చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 110 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్‌.టి.రామారావు వంటి లెజండరీ హీరో నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఒక దశలో ఎన్‌.టి.ఆర్‌. ఇమేజ్‌ పీక్స్‌కి వెళ్లిపోవడంలో ప్రధాన పాత్ర పోషించారు రాఘవేంద్రరావు. అప్పటి టాప్‌ హీరోలైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలకు బ్లాక్‌ బస్టర్స్‌ అందించారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు రూపొందించారు. అంతేకాదు, వెంకటేష్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి హీరోలను పరిచయం చేసి వారికి శుభారంభాన్నిచ్చారు. కమర్షియల్‌ చిత్రాల్లోనే కాదు, భక్తి చిత్రాల్లోనూ తన ప్రత్యేకతను చూపించారు. మనం మాట్లాడడం కాదు, మనం చేసిన సినిమా మాట్లాడాలి అని బలంగా నమ్మే దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

1942 మే 23న కె.ఎస్‌.ప్రకాశరావు, కోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జన్మించారు రాఘవేంద్రరావు. అయితే ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా మద్రాస్‌లోనే జరిగింది. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకుడు అవ్వక ముందు హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 1950లో మొదటి రాత్రి చిత్రంతో దర్శకుడిగా మారారు. రాఘవేంద్రరావుపై తండ్రి ప్రభావం బాగా ఉండేది. సినిమాలపై ఆసక్తి, దర్శకుడు కావాలన్న కోరిక ఆయనకు చిన్నతనంలోనే కలిగాయి. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరమని రాఘవేంద్రరావుకు చెప్పారు ప్రకాశరావు. అయితే తను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమా రంగంలోకి వస్తానని చెప్పారు. అలా బి.ఎ. పూర్తయిన తర్వాత దర్శకత్వ శాఖలో చేరారు. పాండవ వనవాసం చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరి మొదటి క్లాప్‌ ఎన్‌.టి.రామారావుపై కొట్టారు. ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. అలా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అలాగే ఎన్టీఆర్‌ చివరి సినిమా మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. తండ్రి ప్రకాశరావు దగ్గర దాదాపు 10 ఏళ్లు దర్శకత్వ శాఖలో పనిచేశారు రాఘవేంద్రరావు. 

1975లో నిర్మాత అడుసుమిల్లి లక్ష్మీకుమార్‌ నిర్మించిన ‘బాబు’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు రాఘవేంద్రరావు. ఈ సినిమాకి ఓపెనింగ్స్‌ బాగానే వచ్చినా రెండు వారాల గ్యాప్‌లో ‘జీవనజ్యోతి’ చిత్రం విడుదల కావడంతో అది పెద్ద హిట్‌ అయింది. ‘బాబు’ ఏవరేజ్‌ మూవీ అయింది. ఆ తర్వాత మమతల కోవెల అనే నవల ఆధారంగా ‘జ్యోతి’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడుగా ఆయనకు పేరు తెచ్చింది. సత్యచిత్ర సంస్థ అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ.. ప్రకాశరావు దర్శకత్వంలో ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో అతనిలోని టాలెంట్‌ గుర్తించారు ఆ నిర్మాతలు. ‘జ్యోతి’ సినిమా జరుగుతున్న సమయంలోనే ఒక భారీ చిత్రం చేసే అవకాశం ఇచ్చారు సత్యనారాయణ, సూర్యనారాయణ. అదే ‘అడవిరాముడు’. అలా ఎన్టీఆర్‌ను తొలిసారి డైరెక్ట్‌ చేసే అవకాశం రాఘవేంద్రరావుకు లభించింది. 

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించాలని నిర్ణయించుకున్నారు. లుక్‌ పరంగా, కాస్ట్యూమ్‌ పరంగా అంతకుముందు ప్రేక్షకులు చూడని ఓ కొత్త ఎన్టీఆర్‌ను ఆవిష్కరించారు రాఘవేంద్రరావు. అడవిరాముడు చిత్రం 1977 ఏప్రిల్‌ 28న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మొదలు దాదాపు 5 సంవత్సరాలపాటు ఎన్టీఆర్‌ కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. డ్రైవర్‌ రాముడు,  కేడీ నెం.1, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్‌చౌదరి వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు ఎన్టీఆర్‌. ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఎన్టీఆర్‌కు ఆ సమయంలో అంతటి క్రేజ్‌ రావడానికి ముఖ్య కారకుడు రాఘవేంద్రరావు అనే చెప్పాలి. ఇక కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులకు కూడా బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సూపర్‌హిట్స్‌ చేశారు. ముఖ్యంగా చిరంజీవితో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది.

పాటల చిత్రీకరణలో అంతకుముందు ఏ దర్శకుడూ చేయని ప్రయోగాలు రాఘవేంద్రరావు చేశారు. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ కూడా అంతే ముఖ్యమని నమ్మి పాటల చిత్రీకరణలో పూలు, పండ్లు, నగలు వాడుతూ వారిని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే 40 సినిమాల తర్వాతే తనకు ఆ ఆలోచన వచ్చిందని రాఘవేంద్రరావు చెబుతారు. ఆ తర్వాత చాలా మంది దర్శకులు పాటల విషయంలో ఆయన్ని అనుసరించారు. తెలుగులోనే కాదు, హిందీలోనూ సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన చేసిన 14 హిందీ సినిమాల్లో 12 సూపర్‌హిట్‌ అవ్వడం విశేషం. పక్కా కమర్షియల్‌ సినిమాలే కాదు, భక్తి రసాత్మక చిత్రాలు కూడా బాగా తియ్యగలనని అన్నమయ్య చిత్రంతో ప్రూవ్‌ చేసుకున్నారు రాఘవేంద్రరావు. కమర్షియల్‌ హీరోగా మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో నాగార్జునతో అన్నమయ్య చిత్రం చెయ్యడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ సినిమా ఘనవిజయం సాధించి నాగార్జున, రాఘవేంద్రరావు కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది. ఆ తర్వాత శ్రీరామదాసు, శిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల నుంచి లభించిన రివార్డులే కాదు, ఎన్నో అవార్డులు రాఘవేంద్రరావును వరించాయి. ఏడు నంది అవార్డులు, 5 ఫిలింఫేర్‌ అవార్డులు, సైమా, ఐఫా, సినీమా అవార్డులు.. ఇలా ఎన్నో ఆయనకు లభించాయి. 

వ్యక్తిగత విషయాలకు వస్తే.. రాఘవేంద్రరావు సతీమణి పేరు సరళ. వీరికి ఇద్దరు సంతానం. వారిలో ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన మొదటి సినిమా బొమ్మలాటకు ఉత్తమ చిత్రంగా, ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్‌కి ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డులు లభించాయి. రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహనరావు. ఇద్దరూ కలిసి ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్‌ బేనర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించారు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌ చేశారు. వాటిలో ప్రముఖంగా వినిపించే పేరు శాంతి నివాసం. గత పాతికేళ్లుగా 10 టీవీ సీరియల్స్‌ నిర్మించారు. అలాగే సౌందర్యలహరి అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. అంతేకాదు, కెఆర్‌ఆర్‌ వర్క్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కెఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌ నిర్వహిస్తున్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.