మహిళల కబడ్డీ వరల్డ్ కప్.. విజేత భారత్
posted on Nov 25, 2025 5:14AM

భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుపై భారత్ 35–28 తేడాతో విజయం ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలవడం వరుసగా ఇది రెండో సారి.
ఈ టోర్నమెంట్ ఆద్యంతం భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. తొలుత గ్రూప్ మ్యాచ్‌లన్నీ అలవోకగా గెలిచిన భారత మహిళల జట్టు సెమీఫైనల్‌లో ఇరాన్‌పై 33–21 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు, చైనీస్ తైపీ కూడా తమ గ్రూపులో అజేయంగా నిలిచి, సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. సెమీస్ వరకూ అజేయంగా నిలిచి సమ ఉజ్జీలుగా భారత్, చైనీస్ తైపీ జట్టు ఫైనల్ లో తలపడ్డాయి. అయితే భారత మహిళల జట్టు చైనీస్ తైపీ జట్టుపై కూడా సునాయాస విజయాన్ని సాధించింది. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ చాంపియన్ ట్రోఫీని ముద్దాడి ప్రపంచ కప్ ను నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి.
భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టును ఓడించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 35-28 పాయింట్ల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది.
భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ విజేతగా నిలవడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత అంకిత భావాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. ఈ విజయం అనేక మంది యువతులను కబడ్డీ ఆడే దిశగా ప్రోత్సహిస్తుందని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.
ఈ చారిత్రక విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ, భారత జట్టుకు అభినందనలు తెలిపారు. పట్టుదల, సత్తా ఈ అద్భుత విజయాన్ని సాధించిపెట్టాయన్నారు. భారత మహిళల జట్టు ప్రపంచకప్ ను వరుసగా రెండు సార్లు గెలవడం దేశానికి గర్వించదగ్గ విషయం అని ఎక్స్ లో పేర్కొన్నారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు.
అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు తెలిపారు. మన మహిళల కబడ్డీ జట్టు వరుసగా రెండోసారి మహిళా కబడ్డీ ప్రపంచకప్‌ను గెలవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమన్న లోకేష్, జట్టులో ఉన్న క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభకు ఇది నిదర్శనమన్నారు. ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశ ప్రతిష్టను ఉన్నత స్థాయికి చేర్చిన మన క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.