చెవిరెడ్డికి మళ్లీ అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
posted on Nov 24, 2025 2:05PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం (నవంబర్ 24) ఛెస్ట్ పెయిన్ అంటూ కంప్లైంట్ చేయడంతో ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
గతంలో కూడా పలు మార్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు ఆరోగ్యం బాలేదంటూ చెప్పడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తరువాత తిరిగి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో తనను ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా చేర్చి చికిత్స అందించాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి ఆందోళనకు గురై అస్వస్థతకు గురై ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను జప్తే చేయవద్దనీ, తాను ఎంత కాలం కావాలంటే అంత కాలం జైలులో ఉంటానంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి శనివారం (నవంబర్ 22)న ఏసీబీ కోర్టులో న్యాయవాదికి మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డిని పోలీసులు శనివారం (నవంబర్ 22) ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు మరో 14 రోజలు పాటు రిమాండ్ విధించింది. ఈ సమయంలో చెవిరెడ్డి న్యాయాధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ, తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని.. ఇది రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు. ఇటీవల తన ఆస్తులను జప్తు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
అయితే.. అవన్నీ తాను నీతి, నిజాయితీతో సంపాయించుకున్న ఆస్తులని.. ఒక్కరూపాయి కూడా అవినీతి లేదని వీటిని జప్తు చేయడం ధర్మం కాదంటూ వేడుకున్నారు. కావాలంటే కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లయినా తనను జైల్లో పెట్టుకోవచ్చన్నారు. అయితే ఆస్తులను మాత్రం జప్తు చేయవద్దంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే, ఈ విషయం తమ పరిధిలో లేదని, సిట్ అధికారులు ఆస్తుల జప్తుకు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆస్తుల జప్తు ఆందోళనతోనే చెవిరెడ్డి అనారోగ్యానికి గురై ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు.