ఇండిగో సంక్షోభానికి అసలు కారణం అదేనా!
posted on Dec 6, 2025 8:20PM

ఆస్ట్రేలియా నుంచి కాశీకి వచ్చారో ఎన్నారై ప్రయాణికుడు. ఆయన భార్య ఇటీవల చనిపోవడంతో.. కాశీలో అస్తికలు కలపడానికి వచ్చారీ ఎన్నారై. అయితే ఇండిగో విమానంలో ఆయన లగేజీ మిస్ అయ్యింది. వెళ్లి కంప్లయింట్ చేయగా 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని అన్నారు.
కట్ చేస్తే వారం రోజులైంది. ఆ లగేజీ ఆ ప్రయాణికుడికి ఎందుకంత ముఖ్యమంటే.. తన కుమార్తె లైఫ్ మెడిసిన్ అందులో ఇరుక్కు పోయింది. ఆ మందులు బయట ఎక్కడా లభించవు. ఆయనకు మాత్రం ఏం తెలుసు.. ఇండిగో విమానాలు ఇలా మొరాయిస్తాయని? దీంతో ఆయన ప్రాణం విలవిలలాడిపోతోంది. కారణం తన కూతుర్ని కాపాడే మందులు ఆ ఇండిగో లగేజ్ లో చిక్కుకుపోయాయి.
ఇక ఢిల్లీలో ఒక ఆఫ్రికన్ మహిళ అయితే ఇండిగో క్యాబిన్ని ఒక ఊపు ఊపేసింది. సిబ్బంది ఉండే గది అద్దాలు పగలగొలట్టి వారి అంతు చూడ్డమే తరువాయి అన్నట్టుగా తయారైంది.
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ రెండు మూడు రోజులుగా ఇండిగో ద్వారా తలెత్తిన సమస్యలు అంతా ఇంతా కాదు. రోజుకు సుమారు 2500 సర్వీసులు నడిపే ఇండిగో ఇలా మొరాయించడంతో మొత్తం ప్రయాణికుల జీవితాలు తారుమారయ్యాయి.
మొన్నంటే మొన్న భువనేశ్వర్- హుబ్బళ్లీకి వెళ్లాల్సిన ఒక ఇండిగో విమానం.. నిలిచిపోవడంతో పెళ్లి రిసెప్షన్ కాస్తా మిస్ అయ్యేలాంటి సిట్యువేషన్. ఒక పక్క చూస్తే బంధుమిత్రులందరినీ పిలిచేశారు. మరో పక్క చూస్తే బోలెడంత ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసేశారు. నవ వధూవరుల విమాన ప్రయాణం కాస్తా రద్దయ్యింది.
దీంతో చేసేది లేక.. వీరేం చేశారంటే ఆన్ లైన్లో తమ రిసెప్షన్లో పాల్గొన్నారు. డయాస్ చూస్తే బోసిగా ఖాళీగా ఉంది. వచ్చిన వారంతా కూడా పెళ్లికొడుకు పెళ్లి కూతురేదని అడగ్గా.. అందుకు వారు అదిగో అంటూ బిగ్ స్క్రీన్ చూపించాల్సి వచ్చింది. వారు తమ రిసెప్షన్ కి వచ్చిన వార్ని ఎక్కడి నుంచో పలకరించాల్సి వచ్చింది. అదన్నమాట సంగతి.
ఇండిగో అత్యంత ప్రధానమైన భారతీయ విమాన సర్వీసు సంస్థ,. ఈ సంస్థ నడిపే విమానాలు ఇక్కడి ఎయిర్ ట్రాఫిక్ లో వాటా యాభై శాతం పైమాట. ఏ నలుగురి టికెట్లు చూసినా వారిలో ఇద్దరు ముగ్గురు డెఫినెట్ గా ఇండిగో ప్యాసింజర్ అయి ఉంటారు.
ఇదంతా ఇలా ఉంటే డిసెంబర్ 8, 9 తారీఖుల్లో హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025 జరగనుంది. ఈ సమ్మిట్ కి కూడా దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరవుతున్నారు. వీరందరికీ కూడా ఇండిగో వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. దీంతో సీఎం సూచనల మేరకు ప్రభుత్వం స్వయానా కలగజేసుకోవల్సి వచ్చింది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్. దీన్నే షార్ట్ ఫామ్ లో FDTL అంటారు. ఆపై సిబ్బంది కొరత కూడా ఇండిగోను తీవ్రంగా వేధిస్తోంది. సాంకేతిక సమస్యల సంగతి సరే సరి. ఆపై వాతావరణం సరిగా లేక పోవడం వల్ల కూడా కొన్ని విమానాలు రద్దవుతున్నాయి. వెదర్ కండీషన్ సరిగా లేక పోవడం కూడా ఇండిగోను తీవ్రంగా బాధిస్తోంది.
మరీ ముఖ్యంగా, పైలెట్ల అలసటను నివారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల కారణంగా ఇండిగో సతమతమైపోతోంది, సిబ్బందిని ప్లాన్ చేయడంలో దారుణంగా విఫలమైంది, అందుకే ఈ సంక్షోభం మొదలైంది. ఈ మిస్ మేనేజ్మెంట్ కారణంగా దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రయాణికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే విమానయాన శాఖ కూటమి వాటాగా సిక్కోలు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని వరించింది. ఇప్పుడీ బర్డెన్ మొత్తం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా బాధిస్తోంది. మరి చూడాలి.. ఇండిగో సంక్షోభం ఏ తీరానికి చేరుతుందో తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఈ మొత్తం సమస్యకు పరిష్కారానికి కారకుడైన ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై వేటు పడ్డం ఖాయంగా తెలుస్తోంది. ఈ దిశగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగని ఇండిగో వ్యవస్థ సెట్ రైట్ అవుతుందా? చూడాలి మరి.
ప్రధాన కారణాలు:
FDTL నిబంధనలు: పైలట్ల పని గంటలు మరియు విశ్రాంతి సమయాలను పెంచే కొత్త నిబంధనలు, కానీ ఇండిగో వీటిని సరిగా అమలు చేయలేకపోయింది.
సిబ్బంది కొరత: కొత్త నిబంధనల వల్ల ఉన్న పైలట్లు కూడా ఎక్కువ పని చేయలేకపోతున్నారు, దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది.
సాంకేతిక సమస్యలు: ఎయిర్‌బస్ A320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్యలు, వాతావరణం కూడా అంతరాయాలకు కారణమయ్యాయి.
ప్రణాళిక లోపాలు: ఈ సమస్యలను ముందుగా అంచనా వేయడంలో మరియు ప్రణాళికలు రూపొందించడంలో ఇండిగో విఫలమైంది.
ప్రభావం:
విమానాల రద్దు: వందలాది విమానాలు రద్దయ్యాయి, వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు.
క్షమాపణలు & రీఫండ్‌లు: ఇండిగో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి, రద్దైన విమానాలకు పూర్తి రీఫండ్‌లు చేస్తామని ప్రకటించింది.
ఈ సమస్య ప్రస్తుతం దేశీయ విమానయానాన్ని ప్రభావితం చేస్తోంది, మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిపై స్పందించింది.