తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు.. సామాన్య భక్తులకే పెద్దపీట

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.   ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల తేదీలను   ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే వీలు కల్పించింది. అంతే కాకుండా ఈ సారి వీఐపీలకు కాకుండా   సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ   కీలక మార్పులు చేసింది.

దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకూ  పూర్తిగా సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మూడు రోజులకు గాను 1.88 లక్షల సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.  ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగుతుంది.  డిసెంబర్ 2 నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

మిగిలిన ఏడు రోజుల్లో  ) ప్రతిరోజూ 15,000 సర్వదర్శన టోకెన్లు, 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్యులకు అదిక సమయం కేటాయించేందుకు   వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని బాగా కుదించారు. మొత్తం 184 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించినట్లు టీటీడీ పేర్కొంది.   తొలిరోజు వీఐపీ బ్రేక్‌ను 4 గంటల 45 నిమిషాలకు, ఇతర రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు పరిమితం చేసింది.  

ఇలా ఉండగా,  వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక చివరి మూడు రోజులూ అంటే జనవరి 6 నుంచి జనవరి 8 వరకూ   స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ఇందు కోసం ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శనం కోసం   రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. 

ఇకపోతే.. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా  డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ పది రోజులూ   తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu