టారిఫ్ ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ కూ రెండు వేల డాలర్లు!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అస్తవ్యస్థ, హేతురహిత టారిఫ్ వార్ ను సమర్ధించుకున్నారు. తన టారిఫ్ విధానం కారణంగా వస్తున్న ఆదాయం నుంచి త్వరలోనే  ప్రతి అమెరికన్‌కు కనీసం 2వేల డాల‌ర్ల‌ చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటన ఇచ్చారు.  ఈ పంపిణీ పరిధిలోకి అధిక ఆదాయం ఉన్న సంపన్నులు రారని పేర్కొన్నారు. 

ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.  తన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. అమెరికా టారిఫ్ లను వ్యతిరేకించే వారిని మూర్ఖులుగా అభివర్ణించారు.  తన హయాంలోనే  అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయమైన దేశంగా మారిందని చెప్పుకుకున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం లేదనీ, స్టాక్ మార్కెట్లలో రికార్డ్ స్థాయి టేడింగ్ జరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు.  తాను అనుసరిస్తున్న టారిఫ్ విధానం కారణంగా దేశానికి ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని పేర్కొన్న ఆయన ఈ నిధులతో  జాతీయ రుణాన్ని తగ్గిండమే కాకుండా, ప్రజలకు డివిడెండ్ రూపంలో నగదు అందిస్తానని పేర్కొన్నారు.  అయితే ఈ డివిడెండ్ ను ప్రజలకు ఎలా, ఎప్పటి నంచి పంపిణీ చేస్తారన్న విషయం మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.  

మరోవైపు దాదాపు అన్ని ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతులపై భారీ టారిఫ్‌లను విధించడం ద్వారా ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ న్యాయపరమైన సవాళ్లను ట్రంప్ తోసిపుచ్చారు. టారిఫ్‌లే తన బలమైన ఆర్థిక ఆయుధమని, ఈ విధానం అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా, స్వతంత్రంగా మార్చిందని ఆయన పునరుద్ఘాటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu