నేలకూలిన తెలంగాణ సాహితీ శిఖరం

ప్రముఖ  కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ   సోమవారం (నవంబర్ 10) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (నవబర్ 10) తెల్లవారు జామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో  కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన  ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  

జనగాం సమీపంలోని రేబర్తి   గ్రామంలో 1961, జులై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్రగీతగా ప్రకటించింది.  తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్రపోషించిన అందెశ్రీని రేవంత్ సర్కార్ ఈ ఏడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్కరించి రూ. కోటి నగదు పురస్కారాన్ని అందజేసింది.  ఇక ఆయన పలు సినీ గేయాలు కూడా రాశారు. ముఖ్యంగా నారాయణ మూర్తి నటించి, నిర్మించిన పలు సినీమాలకు అందెశ్రీ పాటలు రాశారు.  

మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు', 'సుడా సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి', 'పల్లెనీకు వందనములమ్మో', 'జన జాతరలో మన గీతం' వంటి అద్భుత గీతాలు అందెశ్రీ కలం నుంచి జాలువారినవే. అందెశ్రీకి 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరధ్వాజ సాహితీ పురస్కారాలను అందెశ్రీ అందుకున్నారు. ఇక 2022 లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది.  

అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచిందన్న ఆయన అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu