కామాక్షి ద గంజాయ్ డాన్ ఆఫ్ నెల్లూర్ అస‌లు క‌థ ఇదే!

ఒక మంచి వాడు- ప‌ది మంది మంచి వాళ్ల‌ను త‌యారు చేయ‌గ‌ల‌డో లేదో  తెలియదుకానీ..  ఒక క్ర‌మిన‌ల్ మాత్రం ప‌ది మంది క్రిమిన‌ల్స్ ని త‌యారు చేయ‌డం ప‌క్కా అని చెప్ప‌డానికి జ‌గ‌న్, ఆయ‌న వైసీపీ,  ఆపై ఆయ‌న చుట్టూ ఉన్న నాయ‌కులు, వారి వారి కార్య‌ క‌లాపాలను బ‌ట్టి ఇట్టే చెప్పేయచ్చంటారు పరిశీలకులు. ఇందుకు తాజా నిదర్శనంగా  నెల్లూరు గంజాయి  మాఫియా లేడీ డాన్ అర‌వ కామాక్షి ఉదంతాన్ని చూపుతున్నారు.  

కామాక్షి తొలుత‌ బోడిగాడి తోట‌లో చిత్తు కాగితాల‌ను అమ్ముకుని బ‌తికేది. భ‌ర్త  ఒక డ్రైవ‌ర్. అలాగ‌ని వీళ్లు అక్క‌డితో ఆగిపోలేదు. ఎలాగైనా  స‌రే  జీవితంలో   ఎద‌గాల‌న్న  ఆలోచ‌న‌తో సినిమా ఫ‌క్కీలో ప్రయత్నాలు చేశారు. దానికి తోడు వీళ్ల చిత్తు కాగితాలు, చెత్త వ్యాపారంలో ఆక‌తాయి పిల్ల‌లు ఎక్కువ‌గా ట‌చ్ లో ఉండేవారు. వీరు ప‌గ‌టి  పూట  చెత్త ఏరుకుని, రాత్రి పూట గంజాయి మ‌త్తులో ప‌డి  తూగే  వారు. ఈ విష‌యం గుర్తించి కామాక్షి.. ఈ అల‌వాటు యువ‌త మొత్తానికి ఎలాగైనా అంట‌గ‌ట్టాల‌నుకుంటున్న‌టైంలో ఈమెకు పాల‌కీర్తి ర‌వి అనే  వైసీపీ  నేత  ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇత‌డి సాయంతో ఒక వైసీపీ మాజీ ఎంపీ ట‌చ్ లోకి వెళ్లిన కామాక్షి గుప్పుమ‌ని గంజాయి  పొగ‌లాంటి  ఘాటైన‌ మాట ఆయ‌న‌తో చెప్పుకుంది. 

మ‌నం ఎలాగైనా  స‌రే గంజాయి దందా మొద‌లు పెట్టాల‌ని ఆ వైసీపీ  నేత‌తో ఆమె చెప్ప‌డం ఆల‌స్యం.. గంజాయి అంటే మ‌న‌కు ద‌ళితుల‌ను మ‌ర్డ‌ర్ చేసి, మ‌రీ ఇంటికి డెలివ‌రీ ఇచ్చే ఎమ్మెల్సీ అనంత‌బాబు ఉన్నాడుగా అంటూ అత‌డితో ప‌రిచ‌యం చేయించాడా వైసీపీ  నేత‌ అక్క‌డి  నుంచి కామాక్షి లైఫ్ స్టైలే మారిపోయింది.

బోడిగాడి  తోట నుంచి త‌న మ‌కాం ఆర్టీడీ కాల‌నీకి మార్చిన కామాక్షి.. గంజాయి దందాను మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా విస్త‌రించింది. స్కూళ్లు, కాలేజీ యువ‌తే టార్గెట్ గా  త‌న మ‌త్తు మార్కెట్ నెట్ వ‌ర్క్ పెంచుకుంటూ పోయి అంచెలంచెలుగా ఈ ఫీల్డ్ లో ఎదిగిపోయింది.   అంతే కాదు ఆమె చుట్టూ భ‌ర్త తో పాటు అత‌డి  బంధుమిత్రుల‌తో స‌హా  గంజాయి దందాను అడ్డూ ఆపూ లేదన్నట్లుగా సాగించింది.  ఈమె మీద ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల వారు  చేసిన ఫిర్యాదులతో   స్థానిక పోలీస్టేషన్లో లెక్క‌లేన‌న్ని కేసులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదుల విషయాన్ని  కొందరు పోలీసులే ఆమెకు చేరవేసేవారు. ఇలా కొందరు పోలీసుల సహకారం కూడా ఉండటంతో కామాక్షి ఆగ‌డాల‌కు  హ‌ద్దూపద్దూ లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు.  

కామాక్షి గంజాయి మాఫియా ఆగ‌డాల‌ను గుర్తించిన‌  సీపీఎం  యువ  నేత పెంచ‌ల‌య్య ఈమె గంజాయి  దందాకు  వ్య‌తిరేకంగా పోరాటం చేసేవారు. ఆయ‌న త‌న దందాకు అడ్డు వ‌స్తున్నాడ‌ని  గుర్తించిన కామాక్షి అత‌డిపై  నిఘా పెట్టి.. రెక్కీ నిర్వ‌హించి.. త‌న మ‌నుషుల‌ను పంపి హ‌త‌మార్చేసింద‌ని పోలీసులు తెలిపారు. ఇది వైసీపీ జ‌మానా కాదు కాబ‌ట్టి కామాక్షి   చిక్కిపోయిందిగానీ.. అదే వైసీపీ ప్ర‌భుత్వ‌మే ఉండి ఉంటే ఇలాంటి హ‌త్యాకాండ‌లు ఎన్ని జ‌రిగినా అడిగే నాథుడే  లేకుండా పోయేవారని పరిశీలకులు అంటున్నారు.  

అందుకే పెంచ‌ల‌య్య హ‌త్య‌కు నిర‌స‌న‌గా.. ఆర్టీడీ కాల‌నీలోని  కామాక్షి  ఇళ్ల‌న్నిటినీ ప‌గ‌ల‌గొట్టారు స్థానికులు. ఆపై సీపీఎం, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు మంగ‌ళ‌వారం  పెంచ‌ల‌య్య మ‌ర‌ణాన్ని ఖండిస్తూ జిల్లా వ్యాప్త బందు నిర్వ‌హించి  ర్యాలీలు తీశాయి. ఇప్ప‌టికేనా గంజాయి బ్యాచ్ ఆగడాలను పూర్తిగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu