రేవంత్ ఫుట్ బాల్ ప్రాక్టీస్
posted on Dec 1, 2025 8:27AM

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. ఒక వైపు ఆ సదస్సు ఏర్పాట్లు, తన పట్టణ బాట, వరుస సమీక్షలతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుల్ బాల్ దిగ్జజంతో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు కూడా సమాయత్తమౌతున్నారు.

‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ (ఎల్‌ఎం10) టీమ్‌తో తలపడే జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ స్కిప్పర్ గా వ్యవహరిస్తారు. ప్రపంచ సాకర్ దిగ్గజం మెస్సీతో తలపడే ఈ మ్యాచ్‌లో ఆడటం కోసం సీఎం రేవంత్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఫుట్‌బాల్ గేమ్ అంటే ఎంతో మక్కువ ఉన్న రేవంత్ రెడ్డి.. తన బిజీ షెడ్యూల్ లో కూడా ప్రాక్టీస్ కు సమయం కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం (నవంబర్ 30) రాత్రి ఎంసీహెచ్ఆర్డీ ఫుట్ బాల్ గ్రౌండ్లొ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
