ఆత్మగౌరవం విద్యతోనే సాధ్యమని చాటిన అంబేడ్కర్
posted on Dec 6, 2025 10:13AM
.webp)
రాజ్యాంగ రూపశిల్పి ,దళితుల ఆశాజ్యోతి బీఆర్.అంబేడ్కర్.. రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమా నత్వం,న్యాయం అంశాలు చేర్చడం ద్వారా భారతీయులందరూ చట్టం ముందు సమానమేనని ప్రతిపాదించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విద్యే ఆయుధమని బోధించారు.విద్య,ఉద్యోగాల్లో వారికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం అంబేడ్కర్ ఆలోచన. బాలగంగాధర్ తిలక్ గనుక అంటరాని వాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని కాకుండా, అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, జన్మహక్కు అనేవాడు అన్న గొప్ప సమతావాది అంబేడ్కర్. ఆయన అసలు పేరు భీం రావు రాంజీ అంబేడ్కర్. చిన్నతనం నుంచి ఆయన వర్ణవివక్ష, అస్పృశ్యత స్వయంగా అనుభవించాడు. భారత్ లో దళితుల అభ్యున్నతికి జీవితకాలం పొరాడిన యోధుడు.అంటరానితనం,కులనిర్మూలన కోసం కృషి చేసిన సంఘసంస్కర్త. అంబేడ్కర్ భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా పని చేసారు.
1927లో శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అంబేడ్కర్ పీష్వాల సామ్రాజ్య పతనం కేవలం అస్పృశ్యత పాటించడం వల్లేనన్నారు. అంటరానివారుగా భావిస్తున్న కులాలవారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేసి ఆయా వృత్తులు చేస్తున్నారని, వారిని ఇతర వర్ణాలవారు గౌరవించడం ధర్మమ న్నారు.అంబేడ్కర్ స్వతంత్ర్య భారత్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. 1930,31,32 లలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.రెండో సమావేశం లో గాంధీ పాల్గొన్నారు.ఈ సమావేశంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ డిమాండ్ కు హిందూ సమాజం విచ్ఛన్నమవుతుందంటూ గాంధీ వ్యతిరేకించారు. ఏకాభిప్రాయం కుదరక గాంధీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గాంధీ, అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం జరిగింది.తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పాటు చేసి అస్పృశ్యత నివారణ కు కృషి చేశారు. ఆ కృషిలో అంబేడ్కర్ నూ గాంధీ భాగస్వామి చేసారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు సహకరించకపోవడంతో అంబేద్కర్ బయటకు వచ్చి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్' ఏర్పాటు చేసి దళితులను సమీకరించారు. స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగపరిషత్ సభ్యుడిగా అంబేడ్కర్ నియామకం జరిగింది. భారత రాజ్యాంగం అత్యంత ప్రామాణికం కావడం వెనుక ఉన్నది అంబేద్కర్ కృషి అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. . 1956లో ఐదులక్షల మందితో అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించారు. గాంధీతో విభేదించినా మతం మారదల్చుకున్నప్పుడు భారత సంస్కృతి లో భాగమైన బౌద్ధాన్ని ఎన్నుకున్నానని చెప్పడం ఆయన దేశభక్తి,భారతీయత పట్ల అభిమానానికి చిహ్నంగా చెప్పుకోవాలి. ముంబైలో బీఏ పూర్తిచేసి లండన్లో ఎం.ఏ, ఎమ్మెస్సీ, పీ.హెచ్.డీ, డీ.ఎస్.సీ, బారిష్టర్, ఎల్ఎల్, డీ.లిట్ చదివారు.
1891ఏప్రిల్ 14న ఇప్పటి మధ్యప్రదేశ్ లోని మౌ అనే గ్రామంలో రాంజీ,భీమాభాయిలకు 14వ సంతా నంగా జన్మించిన అంబేడ్కర్ బరోడా మహారాజు ఇచ్చిన విద్యార్థి వేతనంతో బీఏ పరిక్ష లో ఉత్తీర్ణత సాధించారు. విదేశాల నుంచి డాక్టర్ అంబేద్కర్ గా 1917లో స్వదేశం వచ్చారు.అప్పటికి ఆయనకు 27ఏళ్లు. మహారాజు శాయోజీరావు సంస్థానం లో సైనిక కార్యదర్శి గా పనిచేసారు. కొల్హాపూర్ మహారాజు సహాయంతో మూకనాయక్ పత్రిక కు సంపాదకుడిగా పని చేశారు. విదేశాలకు వెళ్లి మరిన్ని ఉన్నత విద్యలు అభ్యసించి తిరిగి వచ్చాడు.1936లో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937ఎన్నికల్లో ఆ పార్టీ 14 స్థానాలు గెలుచుకుంది. ఆయన యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకం కులవ్యవస్థ ను తీవ్రంగా విమర్శించింది.దళితులు భారతీయ ముస్లింల కంటే కాంగ్రెస్ విధానాల వల్ల అణచివేయబడ్డారని విమర్శించారు. అనారోగ్యంతో 1956 డిసెంబర్ 6వ తేదీ మరణించారు.ఆయన మరణించి 69 ఏళ్లు గడిచినా అంబేద్కరిజం భారత్ లో సజీవంగా ఉంది. నేడు దళితులు సాంఘికంగా,రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందడం ఆయన పోరాటం ఫలితమే. ఆయన చూపిన దారిలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాలిదారిలో నడవడం నిజమైన నివాళి.
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా..