ఐదు వేల మంది పోలీసులతో ఆపరేషన్ కవచ్
posted on Dec 6, 2025 8:12AM

నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరిట భారీ నాకాబందీ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో శుక్రవారం (డిసెంబర్ 5) రాత్రి ఈ ఆపరేషన్ జరిగింది. ఏకకాలంలో ఐదువేల మంది పోలీసులతో ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఇంత మంది పోలీసు సిబ్బందితో నాకాబందీ చేపట్టడం కమిషనరేట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఏకకాలంలో నగరంలోని 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్ , బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి.
ఆపరేషన్ కవచ్ నేపథ్యంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ తనిఖీలకు నగర పౌరులందరూ పూర్తి సహకారం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ కవచ్ అనంతరం కూడా మీ భద్రత – మా బాధ్యత అంటూ సజ్జనార్ మరో పోస్టు చేశారు.