గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్‌పై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష
posted on Dec 5, 2025 9:09PM

రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈరోజు శుక్రవారం ఆయన అడిషనల్ డీజీపీలు మహేష్ భగవత్, డీఎస్ ఛౌహాన్, ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, టీజీఐఐసీ ఎండీ శశాంక్, ఐజీ రమేష్ రెడ్డిలతో కలిసి బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. డెలిగేట్లకు డిసెంబర్ 8, 9 తేదీల్లో మాత్రమే ప్రవేశం ఉండగా, తర్వాత నాలుగు రోజులు సాధారణ ప్రజలకు ప్రాంగణం అనుమతించబడుతుందని ఆయన వెల్లడించారు.
భద్రతా చర్యల భాగంగా సమ్మిట్ ప్రాంగణంలో మూడు అంచెల భద్రతను అమలు చేయనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ప్రాంతం అంతటా నిఘా కోసం వెయ్యికిపైగా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తుండగా, ఇవన్నీ సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమవుతాయని తెలిపారు. రేపు సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు.
బందోబస్తు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం అనుమతించబోమని, అన్ని విభాగాల అధికారులు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు తగినట్టుగా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
అదనంగా, సమ్మిట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనుండగా, రహదారి మళ్లింపులు, బారికేడ్లు, పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్ పనిచేయనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు సాధారణ ప్రజలకు కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి రానున్నాయి.గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఎటువంటి అంతరాయం లేకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు అందుబాటులో ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు...