రాజ్యసభలో విమానాల రద్దు అంశం.. చర్యలు తీసుకుంటామన్న కేంద్రం

గతమూడు నాలుగు రోజులుగా రోజులుగా విమానాల రద్దు అవుతూ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడటం, విమానాశ్రాయాలలో ఆందోళనలకు దిగడం తెలిసింది. ముఖ్యంగా ఒక్క ఇండిగో సంస్థ  దాదాపు 500 విమానాలను రద్దు చేసిన అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.  ఈ విమానాల రద్దు అంశం సాధారణ పౌరుల నుంచి ఏంపీల వరకూ అందరిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి రాజ్యసభలో చెప్పారు. రాజ్యసభ జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన  ఒక విమానయాన సంస్థ గుత్తాధిపత్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు.

ఇందుకు సంబంధించి  ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సభకు చెప్పారు.  తాను పౌర  విమానయాన శాఖ మంత్రితో మాట్లాడానన్న ఆయన  విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.  వాస్తవానికి నిర్వహణ లోపాల కారణంగానే  ఇండిగో విమాన సర్వీసులకు ఆటంకం కలిగిందని, ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై కేంద్రం కూడా రంగంలోకి దిగి విమానాల రద్దుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని కిరణ్ రిజుజు అన్నారు.  బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

అదలా ఉంటే..  విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ   పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలిస్తూ శుక్రవారం  ఉత్తర్వులు జారీ చేసింది. పైలట్లకు  వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయ రాదు అన్న షరతులు ఉపసంహరించింది.

ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  ఇలా ఉండగా ఒక్క శుక్రవారం (డిసెంబర్ 5)నే  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు  క్యా న్సెల్ అయ్యాయి. అలాగే వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu