మాలిలో ఇద్దరు తెలుగు కార్మికులు కిడ్నాప్

పొట్ట కూటి కోసం కూలీలుగా మాలిలో పని చేస్తున్న ఇద్దరు తెలుగు కార్మికులు   కిడ్నాప్‌ నకు గురయ్యారు. వీరిలో ఒకరు యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమరం గ్రామానికి చెందిన నల్లమాస్ ప్రవీణ్ కాగా, మరొకరు అలాగే సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన రామచంద్రన్. వీరిరువురూ ఏడాది కిందట  రూబీ బోర్‌వెల్ కంపెనీ ఉద్యోగం కోసం మాలి దేశానికి వెళ్లారు.  అయితే గత నెల   23న  గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.  కాగా అప్పటి నుంచీ  మొబైల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు.  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ వారిని  సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. కాగా మాలిలో తెలుగు యువకుల కిడ్నాప్ నకు సంబంధించి సంబంధిత అధికారులు  దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వీరి గురించి ఎటువంటి సమాచారం అందలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమౌతున్నారు.  

ఇలా ఉండగా వీరిని జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ (జేఎన్ఐఎం) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కాగా వీరు పని చేస్తున్న బోర్ వెల్ సంస్థ యాజమాన్యం కూడా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగుల విడుదల కోసం ఉగ్రవాదులు ఏ డిమాండ్ చేసినా అంగీకరించి తీర్చుందుకు సిద్ధంగా ఉన్నట్లు బోర్ వెల్ సంస్థ యాజమాన్యం ఎంబసీ అధికారులతో చెప్పినట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu