కోల్ కతా విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?
posted on Nov 10, 2025 2:46PM

విమానాలలో ఇటీవలి కాలంలో తరచుగా ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. విమాన ప్రయాణమంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఈ సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరగడం అన్నది పక్కన పెడితే.. విమానాల రాకపోకలలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం లేదా అర్ధంతరంగా విమాన సర్వీసు రద్దు కావడం వంటివి జరుగుతుండటంతో ప్రయాణీలుకు నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాయి. అలాగే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు విమానంలో ఉన్న ప్రయాణీకులు తమ ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న భయాందోళనలతో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు స్పైస్ జెట్ ప్రయాణీకులు.
ముంబై నుంచి కోల్ కతా వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సరిగ్గా కొల్ కతాలో ల్యాండింగ్ కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే కోల్ కతా విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి విమానం గాల్లో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ 670 విమానం ఆదివారం రాత్రి ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో, విమానంలోని ఒక ఇంజిన్ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. వెంటనే విమానాశ్రయ అధికారులు వెంటనే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక, సహాయక బృందాలను రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:38 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు. కోల్‌కతాలో ల్యాండింగ్ సమయంలో తమ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని జెట్ ఎయిర్ స్పేస్ సంస్థ ధృవీకరించింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది.