తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్!
posted on Nov 10, 2025 2:16PM

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కేటీఆర్ సుప్రీం కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా ఫిర్యాయింపు ఎమ్మెల్యేల విచారణకు తమకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరుతూ.. కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు కోరారు.చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. తమ కేసు విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ గవాయ్... తాను ఈ నెల 23న పదవీ విరమణ చేస్తున్నాననీ, ఆ తర్వాత నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు అని వ్యాఖ్యానించారు.
వాదనలు విన్న అనంతరం, ఈ పిటిషన్ విచారణను వచ్చే సోమవారం చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరగడం ఖాయమైంది. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.