లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని సుప్రీంలో పిటిషన్
posted on Aug 29, 2025 5:51PM

లంబాడీలను, బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు పిటిషన్ వేశారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని, వేరే రాష్ట్రల నుండి వచ్చి గిరిజనుల హక్కులను కొల్లగొడుతున్నారని ఎమ్మెల్యే తెల్లం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది.
బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మిగిలిన ఎస్టీ కులాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నారని ఆ పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అలాంటి వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిన కోయ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి విచారణ జరిపే అవకాశం ఉంది.