ఆరునెలలలోగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం.. కేంద్రమంత్రి పెమ్మసాని
posted on Nov 22, 2025 11:48AM

అమరావతి రైతుల సమస్యల పరిష్కారం విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే శనివారం (నవంబర్ 22) న త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సీఆర్డీయే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, రైతు జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. భూముల రిజిస్ట్రేషన్, అభివృద్ధి పనులు వంటి వాటిపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఇటీవలే రైతు జేఏసీ ప్రతినిధులతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమై రాజధాని రైతుల సమస్యలను సానుకూల దృక్ఫథంతో సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజధానికి భూములిచ్చిన రైతులెవరికీ ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మొత్తం 69,421 మంది రైతులకు ఇప్పటి వరకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.
ఇలా ఉండగా త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరు నెలలలోగా రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద భూముల్లో 20 ఎకరాలు కుటుంబపరమైనవి కాగా, మరో 45 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయన్నారు. ఇప్పటికే రాజధాని పరిధిలో 90 శాతానికి పైగా కుటుంబాలకు ప్లాట్లను కేటాయించామని వెల్లడించారు. అన్ని సమస్యలనూ ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ఏ రైతుకూ అన్యాయం జరగకూడదన్నదే తమ లక్ష్యమని పెమ్మసాని స్పష్టం చేశారు.