సజావుగా ఎస్ఐఆర్.. 99శాతం పూర్తి!
posted on Nov 25, 2025 11:51AM
.webp)
దేశంలోని తొమ్మది రాష్ట్రాలు, మూడు యూనియన్ టెరిటరీలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా, వేగంగా సాగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (నవంబర్ 24) ప్రకటించింది. ఇప్పటి వరకూ ఎస్ఐఆర్ లో భాగంగా ఈ తొమ్మది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 99 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయ్యిందని పేర్కొంది. ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలలో ఉన్న 50.97 కోట్ల మంది ఓటర్లలో 50.50 కోట్ల మంది ఓటర్లకు పాక్షికంగా పూరించిన ఫారాలను జారీ చేసినట్లు ఎస్ఐఆర్ బులిటిన్ పేర్కొంది. ఈ నెల 4న మొదలైన రెండో దశ ఎస్ఐఆర్ వచ్చే నెల 2 వరకూ సాగుతుంది.
రెండో దశ ఎస్ఐఆర్ లో భాగంగా ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలయిన పుదుచ్చేరి, అండమాన్ ,నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఎస్ఐఆర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తయ్యింది.