పుతిన్, జిన్ పింగ్, మోడీ...వీరి మధ్య పోలికేంటి!?
posted on Dec 5, 2025 5:02PM

ప్రపంచంలోనే ప్రస్తుతం సుదీర్ఘ కాలంగా ఒక దేశాన్ని ఏలుతున్న పవర్ఫుల్ లీడర్స్ లో పుతిన్ అగ్ర స్థానంలో నిలుస్తారు. ఆయన గత పాతికేళ్లుగా రష్యాను అధ్యక్ష హోదాలో పరిపాలిస్తున్నారు.1999 చివరలో తాత్కాలిక అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన పుతిన్, 2000 నుండి 2008 వరకు, 2012 నుంచి ఇప్పటి వరకు ఆయనే ఆ దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, 2020 రాజ్యాంగ సవరణలతో 2036 వరకు పదవిలో ఉండేందుకు వీలు కల్పించారు. దీంతో సుమారు 36, 37 ఏళ్ల పాటు పుతిన్ రష్యాను పాలించిన రికార్డు క్రియేట్ చేయనున్నారు.
ఇక అత్యధిక కాలం అతి పెద్ద దేశాన్ని పాలించిన వారెవరని చూస్తే వారిలో జిన్ పింగ్ తర్వాతి స్థానంలో నిలుస్తారు. జిన్‌పింగ్ 2012 నుండి చైనాకు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు, 2013లో ఆయన అధ్యక్షుడయ్యారు. 2018లో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాల పరిమితిని తొలగించారు, దీంతో ఆయన జీవితకాలం పాటు పాలించే అవకాశం ఉంది, ఆయన ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవల జిన్ పింగ్ కొంత కాలం కనిపించక పోయే సరికి ఆ తర్వాతి అధ్యక్షుడెవరన్న చర్చ నడిచింది.
ఇక మోడీ సంగతి చూస్తే వీరికన్నా కాస్త లేటుగా భారతదేశ ప్రధాని బాధ్యతలను చేపట్టగా.. ప్రస్తుతం మూడో మారు ప్రధానమంత్రిగా ఎన్నికై.. నాన్ స్టాప్ గా భారతదేశాన్ని ఏలుతున్నారు. పుతిన్, జిన్ పింగ్, మోడీకి దగ్గర పోలిక ఏంటంటే అప్రతిహతంగా ఎక్కడా తమ పాలనాకాలాన్ని బ్రేక్ చేసుకోకుండా పని చేస్తూ రావడం. అయితే పుతిన్, జిన్ పింగ్ కి ఉన్న వెసలుబాటు మోడీకి లేక పోవడం మైనస్. ఇక్కడ సుదీర్ఘ అధ్యక్ష పాలన అంటూ ఉండదు. అప్పటికే మోడీ ప్రాతినిథ్యం వహించే బీజేపీకి.. 75 ఏళ్ల వయో పరిమితి కూడా ఉంది. అయితే మోడీ విషయంలో ఈ నిబంధనకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది సంఘ్ పరివార్.
భారత్ కి మల్లే రష్యా చైనాల్లో ఎన్నికల వ్యవస్థలున్నా.. అవి అధ్యక్ష పీఠాన్ని కదిల్చే పరిస్థితి ఉండదు. ఒక్కసారి రాజ్యాంగ పరమైన మార్పు చేస్తే ఇక ఆయా అధ్యక్షులు లైఫ్ లాంగ్ ఉండగలరు. అదే భారత్ అమెరికాలలో అలాక్కాదు.. ఇక్కడ ప్రతి నాలుగైదేళ్లకు ఎన్నికలుంటాయి. దీంతో ఈ రెండు దేశాల్లో గెలుపోటములు ప్రభావితం చేస్తుంటాయి వీరి వీరి పాలనా కాలాలను.
ట్రంప్ కి కూడా నాన్ స్టాప్ గా అమెరికా అధ్యక్షుడిగా ఉండాలన్న కోరిక ఉంటుంది కానీ, అక్కడి రాజ్యాంగం అందుకు అనుమతించదు. ఇక మోడీ ఇక్కడ కూడా సరిగ్గా జమిలీ ఎన్నికలు, అధ్యక్ష పాలన వంటివి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్న భారత దేశంలో అలాంటి మార్పులకు అవకాశముందా? అంటే చాలా చాలా కష్టతరంగా చెప్పాల్సి ఉంటుంది. అప్పటికీ మోడీ మూడోమారు కూడా ప్రధానికావడం పట్ల ప్రతిపక్ష పార్టీలో ఈసీని మేనేజ్ చేస్తున్నారన్న కామెంట్లు చేస్తుంటారు.
ఇక ఫైనల్ గా ఒక మాట ఏంటంటే సుదీర్ఘంగా అధ్యక్ష స్థానంలో ఉండే పుతిన్, జిన్ పింగ్, మోడీ వంటి వారికి ఒక రకమైన ప్రైవేట్ లైఫ్ ఉండక పోవచ్చు. ఎప్పుడూ అధికార ప్రభావంలో ఉండటం.. ఎంతైనా వారికి ఇబ్బంది కరమైన పరిణామమే. అను నిత్యం నిఘా కళ్ల మధ్య జీవించాల్సి ఉంటుంది. ఇటీవల చిన్నపాటి రెస్ట్ తీసుకోడానికో ఏమో జిన్ పింగ్ కొన్నాళ్ల పాటు కనిపించక పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అలజడికి కారణమైంది. మోడీకంటే వ్యక్తిగత జీవితంలో భాగంగా పెళ్లాం పిల్లలే లేరు. దీంతో ఆయన ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ కోరుకోక పోవచ్చని అంటారు విశ్లేషకులు.
ఇక ఆహారపు అలవాట్లు శారీరక ధారుడ్యం వంటివి కూడా వీరికి సమస్యాత్మకమే. పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆ యా ప్రాంతాలకు చెందిన ఆహారాన్ని స్వీకరించ లేరు. అది ప్రొటోకాల్. ఆయన వెంట ఆయన ఆహారం సమకూర్చి పెట్టే చెఫ్ లు సైతం వస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏ ఫుడ్ పాయిజన్ కలుస్తుందో అన్న ఆందోళన కొద్దీ ఆయన్ను బయట ఆహారం ఏదీ తిననివ్వరు. అంటే, పిచ్చాపాటిగా తిరగడం గానీ ఇష్టమొచ్చిన ఆహారాన్ని ఆస్వాదించడంగానీ వీరికి వీలు కాదన్న మాట. ఇక ఈ స్థాయిలో ఉండే వారికి వయసు ఎలాగూ మీద పడే ఉంటుంది కాబట్టి జిహ్వచాపల్యం పెద్దగా ఉండక పోవచ్చు. కానీ ఏది ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు వారికి సాధ్యం కాదనే చెప్పాల్సి ఉంటుంది. మరి మీరేమంటారు.