హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
posted on Dec 5, 2025 7:04PM
.webp)
గత పదేళ్ల పరిపాలనలో బీఆర్‌ఎస్ నాయకులు తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా.. కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
వరి వేసుకుంటే ఉరి అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన పరిస్థితి.. కానీ ఈనాడు సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రేవంత్ స్ఫష్టం చేశారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించామని.. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణమని తెలిపారు.
2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాదని రూ. 22,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. నర్సంపేటకు మరో 3500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డుల ద్వారా.. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని. రేషన్ కార్డుల్లో కొత్తవారికి చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించామని తెలిపారు.హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మార్చి 31 లోగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ప్రకటించారు.
సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వ వద్దు. పనితనం ఉన్న వాడు నాయకుడు కావాలి తప్ప… పైసలతో పదవులు కొనుక్కునే పరిస్థితి రావద్దు. అది గ్రామాల భవిష్యత్ కు మంచిది కాదని సీఎం తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనకు కొనసాగింపుగా గ్రామాల్లో ప్రజా పాలన తెచ్చుకోవాల్సిన తరుణం వచ్చింది. మంచి వ్యక్తులను, సమర్థులను, గ్రామ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉన్నవాళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి గురించి జిమ్మేదార్ తీసుకుని మంత్రులను కలిసి, సమస్యలను వివరించి, ఒప్పించి, మెప్పించి, పరిష్కరించే ఓపిక ఉన్న నాయకుడు గ్రామ సర్పంచ్ గా ఉండాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు, లొంగకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని రేవంత్ తెలిపారు.