హవ్వ ఇదేం పని.. పోలీసువేనా?
posted on Nov 26, 2025 11:51AM

అంబర్ పేట పీఎస్ లో ఎస్ ఐగా పని చేస్తున్న భానుప్రకాష్ సస్పెండయ్యారు. అయితే అయ్యో పాపం అని ఎవరూ అనడం లేదు. ఎందుకంటే.. ఓ పోలీసు అనేవాడు చేయకూడని చేసి సస్పెండ య్యారాయన. ఇంతకీ ఆయనేం చేశారంటే.. క్రైమ్ విభాగంలో పని చేసే భాను ప్రకాష్.. ఓ దొంగతనం కేసులో రికవర్ చేసిన దాదాపు ఐ తులాల బంగారాన్ని ఏకంగా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు వాడేసుకున్నారు.
దీనిపై ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే ఆయన సర్వీస్ రివాల్వర్ ను కూడా తాకట్టే పెట్టేశారు. ఆర్థిక సమస్యల ఉండటంతో ఎస్సై భాను ప్రకాష్ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు తన సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టేసినట్లు తేలడంతో పోలీసు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
ఎస్ఐ భాను ప్రకాష్ బెట్టింగులకు బానిసై అందిన కాడికల్లా అప్పులు చేసి అవి తీర్చే మార్గం కనపడకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.