అర్థ‌రాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స‌జ్జ‌నార్.. ఏం చేశారు? ఎక్కడికెళ్లారంటే?

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదివారం (నవంబర్ 23) అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో ఎక్క గస్తీ తిరిగారు. ముఖ్యంగా లంగర్ హౌజ్, టోలీ చౌకీ ప్రాంతాలలో ఆయన పెట్రోల్ వాహనంలో తిరిగారు.  సైరన్ లాంటి ఆర్బాటాలేం లేకుండా పెట్రోల్ వాహనంలో తిరుగుతూ,  లంగ‌ర్ హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లో నివాసం ఉంటున్న రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్న రౌడీ షీటర్లను లేపి మరీ వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు.  

మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడమే కాకుండా, నేర ప్ర‌వృత్తి వీడి సన్మార్గంలోకి రావాల‌ని హిత‌వు ప‌లికారు.  సౌత్ వెస్ట్ జోన్‌లో నగర సీపీ  సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము మూడు గంటల వరకూ లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నిత ప్రదేశాలలో గస్తీ తిరుగుతూ పరిశీలించారు.  టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లి  నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.

అలాగే పెట్రో లింగ్ సిబ్బంది అప్రమత్తతను కూడా పరిశీలించారు.  అలాగే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టౌలీచోకీ పీఎస్ లో స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను  పరిశీలించారు. 

ఈ సందర్భంగా సజ్జనార్  రాత్రి వేళల్లో పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకే తాను పెట్రోలింగ్ వాహనంలో ఇలా ఆకస్మిక పర్యటన చేసినట్లు తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బందిలో బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యత పెరిగేందుకు దోహదం చేస్తాయన్నారు. విజిబుల్ పోలిసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయనీ సందర్భంగా పోలీసు సిబ్బందికి సూచించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu