పుతిన్‌కు రాష్ట్రపతి విందు...రాహుల్, ఖర్గేలకు అందని ఆహ్వానం
posted on Dec 5, 2025 8:07PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు మాత్రం ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే ఇందుకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఆహ్వానం లభించింది. కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
దీనిపై శశిథరూర్ స్పందిస్తూ, తనకు అందిన ఆహ్వానాన్ని గౌరవిస్తానని, ఏ ప్రాతిపదికపై విపక్ష నేతను ఆహ్వానించలేదో తనకు తెలియదని అన్నారు. శశిథరూర్‌కు దౌత్య వవహరాల్లో అనుభవం ఉన్నందున ఆయనను ఆహ్వానితుల జాబితాలో చేర్చి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే శశిథరూర్ గతంలో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించడం, రష్యా అధికారులతో అనుబంధం కారణంగా ఆయనను విందుకు ఆహ్వానించి ఉండొచ్చని తెలుస్తోంది.
విదేశీ అధినేతలు ఇండియాకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యే ఎన్డీయే ప్రభుత్వం పక్కన పెడుతోందని రాహుల్ గాంధీ నిన్ననే విమర్శలు చేశారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కూడా విపక్ష నేతలను కలిసే సంప్రదాయం ఉండేదని రాహుల్ గుర్తు చేశారు. ఈ ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఖర్గే, రాహుల్ గాంధీలకు ఆహ్వానం అందలేదు.