దూసుకొస్తున్న దిత్వా తుఫాను...రేపు స్కూళ్లకు సెలవు
posted on Nov 30, 2025 1:39PM

నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాను ప్రభావం ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారమే జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాగా ఆదివారం, సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారంతో ఆపై ఆకస్మిక వరద సూచన చేశారు.
దాంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో అనూష సూచించారు. లోతట్టు,తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఏ సహాయం కావాలన్నా నేరుగా అధికారులు సంప్రదించవచ్చని తెలిపారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేశామన్నారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు స్పష్టం చేశారు. నీటిపారుదలశాఖ, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్అండ్‌బీ, పంచాయతీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక, మున్సిపల్ తో పాటు అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉన్నామని ప్రజలకు ధైర్యం కలిపించారు.
ఉద్యోగులు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటమాని భారీ వర్షాలు కురిసేటప్పుడు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ.. ప్రజలకు వివిధ జాగ్రత్తలు సూచించారు. మరోవైపు దిత్వా తుపానుతో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగవాన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా రేపు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది
ఉత్తర కోస్తాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సోమవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో రెండో నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
తుపాను హెచ్చరికలతో రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. మరో మూడు బృందాలను సిద్ధంగా ఉంచింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.