స్కూళ్లలో ఇక ప్రతి శుక్రవారం విలువల పిరియడ్

సమష్టి కుటుంబాలతో పాటే కుటుంబ విలువలూ మాయమైపోతున్న కాలం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో  రాజకీయంగా అత్యంత ప్రభావమంతమైన కుటుంబాలలో కూడా అన్నా చెళ్లెళ్లు, తల్లీ కొడుకులు వేరుపడటం చూశాం. కుటుంబ విలువలకు తిలోదకాలిచ్చి మరీ విమర్శలతో రోడ్డున పడటం చూశాం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో సమాజంలో నైతిక విలువలను కాపాడాలంటే ముందుగా కుటుంబ విలువలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల గురించి ఇసుమంతైనా అవగాహన లేని నేటి విద్యార్థులకు కుటుంబ విలువల పట్ల సరైన బోధన అవసరం. అలాగే వాటిపై అవగాహన పెరగాల్సిన అవస్యకత ఎంతైనా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సరిగ్గా ఆ విషయంపైనే దృష్టి పెట్టారు.  ఏపీలో విద్యార్థులకు విలువలు, మరీ ముఖ్యంగా కుటుంబ విలువల గురించి బోధన అవసరం అని భావించారు. అందుకే ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును ఆ పనికి నియోగించారు. ఈ విషయాన్ని  చాగంటి కోటేశ్వరరావు స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సోమవారం (నవంబర్ 24) చాగంటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  చంద్రబాబు కుటుంబ విలువలు, కుటుంబ నీతికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారని చాగంటి అన్నారు. ఒక వ్యక్తి కుటుంబం, తల్లిదండ్రులు, తోబుట్టువులకు విలువనిస్తేనే.. సమాజ విలువలను అవగాహన చేసుకోగలు గుతాడని చంద్రబాబు చెప్పారన్నారు.  కుటుంబ విలువలు నైతిక విలువల గురించి పిల్లలకు బోధించాలని తనకు సూచించారన్నారు.  కుటుంబ విలువల గురించి చంద్రబాబులో నిజాయితీతో కూడిన ఆందోళన ఉందన్న చాగంటి ఆయన తనకు అప్పగించిన పనిని బాధ్యతతో నెరవేరుస్తానని చెప్పారు.  
వాస్తవమే.. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు మాత్రమే లక్ష్యం కాకూడదు.. సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి. ఇప్పుడు అదే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో  ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారు మంత్రి నారా లోకేష్.  రాష్ట్ర వ్యాప్తంగా   నైతిక విలువల విద్యా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు.  

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను నైతిక విలువలతో బలోపేతం చేయాలని సంకల్పించారు. ఆ బాధ్య తను ప్రవచనకారుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు అప్పగించారు.  విలువలను విద్యలో భాగం చేసేందుకు పాఠ్య పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో నైతిక విలువల విద్యా సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే విజయవాడలో సోమవారం (నవంబర్ 24)  తొలి సదస్సు జరిగింది.  విలువలు అనేవి మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఉండాలని చాగంటి ఈ సందర్భంగా ఉద్బోధించారు.  విద్యార్థులకు ఈ విషయాన్ని పాఠశాల స్థాయి నుంచే బోధించాల్సిన అవసరం ఉంది.  

చాగంటి ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏ పనైనా పిల్లలు చేయాలని భావించినప్పుడు ఆ విషయాన్ని తల్లికి ముందుగా చెప్పాలి. అలా చెప్పలేమనుకున్న పని అసలు చేయనేకూడదు. ఇది విద్యార్థులకు చాగంటి చెప్పిన తొలి నైతిక సూత్రం.  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలి. ఒక్క విద్య మాత్రమే కాదు  నైతికతతో , రుజువర్తనతో సమాజంలో మార్పు వస్తుంది.   

ఇప్పటికే  విద్యార్థులలో మార్పు వస్తున్నది. విద్యా మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకువచ్చిన సంస్కరణలు విద్యార్థులను బాధ్యత దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. గుంటూరు జిల్లా నర సరావుపేటలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సొంతంగా  రోజూ 10 నిమిషాలు స్కూల్ శుభ్రం అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. అలాగే  తిరుపతి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యా ర్థులే స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించి స్టీల్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. విజయ నగరం జిల్లాలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో  విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టంబర్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 700 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో విద్యార్థులు ప్రతి ఆదివారం స్థానిక వృద్ధాశ్రమానికి వెళ్లి, వృద్ధులతో గడుపుతున్నారు.  

ఇక త్వరలో  1 నుంచి 12వ తరగతి వరకూ చాగంటి మార్గదర్శకత్వంలో విడుదల కానున్న నైతిక విలు వల పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిరియడ్ నైతిక విలువల బోధనకు కేటాయించనున్నారు.  విద్యార్థులలో నైతిక విలువలపై అవగాహన పెంపోందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu