గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
posted on Nov 25, 2025 8:53AM
.webp)
హైదరాబాద్ శాలిబండ ప్రాంతంలోని గోమతి ఎలక్ట్రానిక్స్ లో సోమవారం (నవంబర్ 24) రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన భారీ అగ్నిప్రమాదంలో షాపులో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. షాపులోని వస్తువులు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. షాప్‌లో ఉన్న ఏసీలు, వాషింగ్ మిషన్లలోని కంప్రెసర్లు ఒకదాని వెంట ఒకటి పేలిపోవడంతో పెద్ద స్థాయిలో శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా చార్మినార్– చాంద్రాయణగుట్ట ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఈ ప్రమాదంలో షాప్‌లో పనిచేస్తున్న సిబ్బంది కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే సమీప ఆసుప త్రులకు తరలించారు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పక్కన ఉన్న భవనాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆ పరిసరాలలో నివసిస్తున్న వారిని తాత్కా లికంగా ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే భారీ నష్టం వాటిల్లింది. ఇక షాపులోని పేలుడు ధాటికి రోడ్డుపై ఆ సమయంలో వెడుతున్న ఒక కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆ కారు డ్రైవర్ మృతి చెందాడు. ఇక కారులో ఉన్నవారు గాయపడ్డారు. ఇలా ఉండగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది నాలుగో అగ్నిప్రమాదమని అంటున్నారు. ఇలా గోమతి ఎలక్ట్రానిక్స్ లో తరచూ అగ్నిప్రమాదాలు జరగడానికి కారణాలపై లోతైన దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.