మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఎన్ కౌంటర్ లో హతం?
posted on Nov 19, 2025 9:39AM

ఛత్తీస్ గఢ్ వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం వంతా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్ల మోత వినిపించేది. నక్సల్ విముక్త భారత్ అంటూ చేపట్టినఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు వరుస ఎన్ కౌంటర్లతో మావోల ఏరివేత చర్యలు చేపట్టారు. దీంతో మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో ఇక్కడ పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఈ క్రమంలో అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం (నవంబర్ 18)న మారేడుమిల్లి అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా బుధవారం ఉదయం ఇదే ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్ ఉందన్న ఆయన మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారం మేరకు మంగళవారం జరిపిన కూబింగ్ లో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఉండటంతో మంగళవారం ఆపరేషన్ చేశామని, మంగళవారం ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మావోయిస్టు షెల్టర్ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయని, 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశామని తెలిపారు.
ఇక బుధవారం ఉదయం కూడా ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారని తెలిపారు. మరణించిన ఏడుగురు మావోయిస్టులలో మోస్ట్ వాంటెడ్ దేవ్ జీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.