20న నాంపల్లి కోర్టుకు జగన్

భారీ జనసమీకరణకు వైసీపీ ప్రణాళిక లీక్
వైసీపీ అధినేత వెళ్లేది విచారణా? యుద్ధానికా అంటూ నెటిజనుల సెటైర్లు

దాదాపు పుష్కరకాలం కిందట జగన్ పై   సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో చాలా వరకూ దీర్ఘకాలంగా స్దబ్దుగా ఉన్నాయి. ఆ కేసులలో ఎటువంటి కదలికా లేదు. అన్నిటికీ మించి ఆయా కేసుల విచారణకు జగన్ సీబీఐ కోర్టుకు హాజరై కూడా ఏళ్లు గడిచిపోయింది.  అయితే ఇప్పుడు ఆయన అనివార్యంగా సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఇటీవల జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే బెయిలుపై ఉన్న జగన్ దేశం విడిచి వెళ్లాలంటే.. కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ అలా అనుమతి మంజూరు చేస్తూ.. లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత సీబీఐ కోర్టుకు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని పేర్కొంది. అందుకు అంగీకరించిన జగన్.. లండన్ నుంచి వచ్చిన తరువాత మాత్రం.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు దానిని కొట్టివేయడంతో ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో గురువారం (నవంబర్ 20) ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు.  గురువారం (నవంబర్ 20) ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన  నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. 

అయితే ఆయన హాజరు ఒక నిందితుడు విచారణ కోసం కోర్టుకు హాజరు అవుతున్నట్లుగా కాకుండా, ఏదో కోర్టు మీదకు దండయాత్రకు వెళుతున్నారా అన్నట్లుగా భారీ జనసమీకరణకు పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ ప్రణాళిక లీక్ అయ్యింది. దీంతో పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు. నెటిజనులైతే జగన్ వెళ్లేది విచారణా, యుద్ధానికా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా కోర్టు విచారణకు వెళ్లే సమయంలో సైలెంట్ గా వెళ్లి కోర్టులో హాజరయ్యామా? అన్నట్లు ఉండాలి కానీ, ఇలా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ఏదో యుద్ధానికి వెడుతున్నట్లుగా వెళ్లడం జగన్ కు మాత్రమే చెల్లిందంటున్నారు.

ఇలా భారీ జనసమీరణతో వెళ్లడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు ఏర్పడతాయనీ, దీంతో ఇక తదుపరి విచారణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందవచ్చు అన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే కోర్టుల ముందు ఇలాంటి పప్పులుడకవు అంటున్నారు. దీనివల్ల ఆయన కోర్టు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఒక వేళ జగన్ బల ప్రదర్శన వికటిస్తే బెయిలు రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu