చలికి తోడు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
posted on Nov 19, 2025 9:18AM

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను కోల్డ్ వేవ్ వణికించేస్తున్నది. ఇప్పుడు చలికి తోడు భారీ వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయనున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కారణంగా రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని, దీంతో చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇవి మరింత పతనమయ్యే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. వర్షాలు, చలిగాలులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా ఉండగా మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం పది గంటలకు కూడా జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక అరకులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.