మాక్ అసెంబ్లీకి మంగళగిరి ఎమ్మెల్యేగా ఎంపికైన విద్యార్థినికి లోకేష్ అభినందన
posted on Nov 26, 2025 4:27AM

నేటి బాలలే రేపటి పౌరులుగా మారి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై స్పందిస్తారు. అందుకోసం పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యా బుద్దులతో పాటుగా సమాజంతో ఎలా నడుచుకోవాలి అనే అంశాలు పాఠశాలల్లో నేర్పిస్తే.. పిల్లలు మంచి పౌరులుగా దేశ అభివృద్దిలో భాగస్వాములు అవుతూ వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారన్న ఉద్దేశంతోనే పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల బోధన, అలాగే రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడిలా మారి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఈ చర్చల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఓ వర్గం విద్యార్థులు మాట్లాడితే.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మరో వర్గం విద్యార్థులు మాట్లాడుతారు. ఈ సందర్భంగా జరిగే చర్చలు అచ్చం అసెంబ్లీని తలపించే విధంగా ఉంటాయి.
విద్యార్థుల మాక్ అసెంబ్లీ, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసింది. అక్టోబరు 21, 22 తేదీల్లో పాఠశాల స్థాయిలో 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించింది. వీరిలో ఆరుగురు చొప్పున మండల స్థాయిలో అక్టోబరు 24, 25 నిర్వహించే పోటీలకు ఎంపిక అయ్యారు. అనంతరం మండల స్థాయి నుంచి ఆరుగురు చొప్పున అదే నెల 29, 30 తేదీల్లో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. చివరికి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయి విద్యార్థుల అసెంబ్లీ పోటీలకు 175 మందిని ఎంపిక అయ్యారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేలా విద్యార్థులను ఎంపిక చేసి శాసనసభలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. అలా మంగళగిరి నియోజకవర్గం నుంచి కనకపుట్లమ్మ ఎంపికైంది. విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ఎన్నికైన మంగళగిరి విద్యార్థిని శ్రీకనకపుట్లమ్మను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆ విద్యార్ధినిని ఆమె కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. 8వ తరగతి చదువుతున్న శ్రీకనకపుట్లమ్మ వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపికవ్వడం ముదావహమని అభినందించారు. ఆ విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మంగళగిరి 11వ వార్డులో నివాసం ఉండే విద్యార్థిని తండ్రి రాము దివ్యాంగుడు. ట్రై స్కూటిపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని, తనకు రూ.6వేల పెన్షన్ వస్తోందని విద్యార్థిని తండ్రి రాము తెలిపారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి తన కుటుంబంలా మారిపోయిందని, మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.
అమరావతిలో బుధవారం (నవంబర్ 26)న నిర్వహించనున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికకావడం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని విద్యార్థిని కనకపుట్లమ్మ పేర్కొంది . మంత్రి నారా లోకేష్ ను కలవడం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.