ప్రతికూల వాతావరణం.. వెనక్కు మళ్లిన జగన్ హెలికాప్టర్
posted on Nov 27, 2025 10:29AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం తప్పింది. పులివెందుల పర్యటనను ముగించుకుని గురువారం (నవంబర్ 27) ఆయన హెలికాప్టర్ లో బేంగ ళూరుకు బయలుదేరారు. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా టేకాఫ్ తీసుకున్న పావుగంటకే పైలట్ హెలికాప్టర్ ను వెనక్కు తీసుకువచ్చి పులివెందులలో ల్యాండ్ చేశారు. విపరీతమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ను వెనక్కు మళ్లించినట్లు తెలిసింది. ఎటువంటి ప్రమాదం లేకుండా హెలికాప్టర్ సురక్షితంగా పులివెందులలో ల్యాండ్ కావడంతో వైసీపీ నేతలు, శ్రేణులూ ఊపిరి పీల్చుకున్నారు.
జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అలాగే అరటి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మూడు రోజుల పర్యటనను ముగించుకుని పులివెందుల నుంచి హెలికాప్టర్ లో గురువారం (నవంబర్ 27) ఉదయం బెంగళూరుకు బయలుదేరారు. అయితే అలా బయలుదేరిన పావుగంటలోనే వాతావరణ ప్రతికూలత కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పైలట్ వెనక్కు మళ్లించి పులివెందులలో ల్యాండ్ చేశారు.