తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (నవంబర్ 26)న సమీక్ష నిర్వహించారు.

కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన ఈ సమీక్షలో   మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే  సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా అన్ని ఏర్పాట్లూ చేయాలని మార్గనిర్దేశం చేశారు.  ఈ సదస్సుకు  ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.  

పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనీ, విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతో పాటు వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు.  ఈ సందర్భంగా ఈ గ్లోబల్  సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాళ్ల డిజైన్లను అధికారులు వివరించారు. సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu