అవినీతి ‘తోపు’దుర్తి!
posted on Nov 28, 2025 3:22PM
.webp)
ఇటీవల జగన్ స్పెషల్ చాపర్ వేసుకుని మరీ ఒక పెళ్లికి హాజరయ్యారు. రాఫ్తాడులో జరిగిన ఆ పెళ్లి మరెవరిదో కాదు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తెది. ఇంతకీ ఈ తోపుదుర్తి ఎవరు? ఆయన నిర్వాకమేంటి? గత వైసీపీ పాలనలో ఈ ప్రకాశుడి అవినీతి ప్రకాశం ఎంత? అని చూస్తూ ఈ తోపుదుర్తి అవినీతి తోపు అని తెలుస్తోంది.
రాఫ్తాడులో పరిటాల కుటుంబం చేతిలో నాలుగు సార్లు ఓడిపోయిన తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి, ఈ సారి ఓడిపోతే తన రాజకీయ జీవితమే సమాప్తం అవుతుందంటూ ఇంటింటికీ తిరిగి చెప్పుకుని ఓటర్ల సానుభూతి సంపాదించి 2019 ఎన్నికలలో విజయం సాధించారు. రాక రాక వచ్చిన అవకాశం.. ఇక మళ్లీ రాదన్న రీతిలో తోపుదుర్తి అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. పేదలకు ఇళ్లు కట్టిస్తానని కాంటాక్టు తీస్కుని రూ. 80 కోట్ల మేర దోచేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకున్న తోపుదుర్తి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. దీంతో జనం 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని తోపుదుర్తికి రుచి చూపించారు.
వివరాల్లోకి వెడితే.. అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019లో గెలిచిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో చేయని అవినీతి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రాప్తాడు జనం. అంతే కాకుండా తన రౌడీయిజంతో నియోజకవర్గంలో భయానక పరిస్థితులు సృష్టించారని విమర్శలు గుప్పిస్తున్నారు. 2019లో రాఫ్తాడు నుంచి గెలవగానే రాక్రీట్ అనే సంస్థను తన సోదరుడితో కలసి స్థాపించిన ప్రకాశ్ రెడ్డి ఆ కంపెనీకి కృష్ణా, గుంటూరు, అనంతపురం, పులివెందుల వంటి ప్రాంతాల్లో జగనన్న సెంటు స్థలంలో కట్టే ఇళ్ల కాంటాక్టు ఇప్పించుకున్నారు. ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పి ముందుగానే 80 కోట్ల రూపాయల అడ్వాన్స్ దండుకున్నారు. ఆ తరువాత ఆ కంపెనీ అడ్రస్ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం ఒక్క ఇంటికి కూడా ఈ రాక్రీట్ సంస్థ పునాదులు వేయలేదంటే ఆ సంస్థ ఎంతకు బరితెగించిందో అర్ధం చేసుకోవచ్చు. తోపుదుర్తి కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారం దాదాపు 48 వేల ఇళ్లు కట్టాల్సి ఉండగా.. ఒక్క ఇల్లు కూడా కట్టకుండా పోవడంతో కూటమి ప్రభుత్వం రాక్రీట్ అరాచకాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా రెవెన్యూ రికవరీ చట్టం- 1890 ప్రకారం చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవ్వడంతో పాటు క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయాలని భావిస్తోంది. చూడాలి మరి తోపుదుర్తిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో?